మిథున్ రెడ్డికి బిగ్ షాక్... అరెస్టుకు మార్గం సుగమం అయ్యిందా?
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ లో అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.;
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ లో అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఈ సమయంలో సీఐడీ కేసు నమోదు చేసింది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసింది. దీంతో... పునాదులు కదిలే అవకాశం ఉందనే కామెంట్లు వినిపించాయి.
ఈ సమయంలో... గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గురువారం హైకోర్టు ఆశ్రయించారు. గత ఏడాది సెప్టెంబర్ 23న సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
తనను ఈ కేసులో నిందితుడిగా చేర్చినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎంపీ మిథున్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది! ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక నిర్ణయం తీసుకొంది.
అవును... గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రకరకాల మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి వేల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు.. అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మరికొందరిపై బలమైన ఆరోపణలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే సీఐడీ కేసు కూడా నమోదు చేసింది.
ఈ కేసులోనే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరగా... హైకోర్టు తోసిపుచ్చింది. మిథున్ రెడ్డికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది! ఇదే సమయంలో... కేసుకు సంబంధించిన పూర్తి వివరలు సమర్పించాలని సీఐడీని ఆదేశిస్తూ.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
దీంతో... మిథున్ రెడ్డి అరెస్టుకు మార్గం సుగమం అయ్యిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని అంటున్నారు.