మైనారిటీలను కుదిపేస్తున్న కూటమి దూకుడు..!
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రెండు కీలక విధానాలు మైనారిటీ ముస్లింలను కుదిపేస్తున్నాయి.;
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రెండు కీలక విధానాలు మైనారిటీ ముస్లింలను కుదిపేస్తున్నాయి. కూటమి పార్టీల్లో బీజేపీ.. ముస్లింలకు వ్యతిరేకమన్న విషయం తెలిసిందే. అయితే.. జనసేన మొదట్లో మైనారిటీల విషయంలో కలుపుగోలుగానే ఉన్నప్పటికీ.. సనాతన ధర్మం పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన దీక్షలు... వేస్తున్న అడుగులు.. బీజేపీతో చేస్తున్న చెలిమి వంటివి మైనారీటీలకు ఆ పార్టీని దూరం చేసింది.
ఇక, మిగిలిన కీలక పార్టీ టీడీపీ. మహ్మద్ ఫరూక్ వంటి వారు మంత్రిగా కూడా ఉన్న చంద్రబాబు టీంలో ఇప్పుడు మైనారిటీలకు సెగ పుట్టించే పనులు చేస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో మైనారిటీ ఓటు బ్యాంకు వైసీపీ తర్వాత టీడీపీకే దక్కనుందన్న వాదనలు వినిపిస్తున్న సమయంలో కూటమిలో భాగస్వామ్య పెద్దపార్టీగా ఉన్న టీడీపీ కూడా ఆ వర్గానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు అలజడి రేపుతున్నాయి.
ప్రధానంగా రెండు కీలక అంశాలు.. ఇప్పుడుమైనార్టీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.
1) కేంద్రం ప్రతిపాదిం చిన వక్ఫ్ సవరణ బిల్లు-2024,
2) హజ్ యాత్రలకు వెళ్లే వారికి విజయవాడ నుంచి అవకాశం లేకుండా పోవడం.
ఈ రెండు విషయాలు కూడా.. మైనారిటీ వర్గంలో తీవ్రస్థాయి ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. వక్ఫ్ బోర్డు చట్టానికి పలు సవరణలు చేస్తూ.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు గత ఏడాది సవరణ బిల్లును తీసుకువచ్చింది. దీనిని రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంది.
అయితే.. మెజారిటీ ముస్లింలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. తమ హక్కులు పోతాయని, తమ భూములకు రక్షణ ఉండదని వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ కూడా.. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఇక, ఏపీ విషయానికి వస్తే.. దీనిపై ఇప్పటి వరకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం ప్రకటించలేదు. వ్యతిరేకంగా తీర్మానం చేస్తే.. కేంద్రానికి ఆగ్రహం కలుగుతుందన్న వాదన వినిపిస్తోంది. కానీ, ఇది అంగీకరిస్తే.. తమకు నష్టమని ముస్లింలు ఆందోళనలకు దిగుతున్నారు.
ఇక, హజ్ యాత్రలకు వెళ్లే ముస్లింలకు వైసీపీ ప్రభుత్వం విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాలు నడిపేలా కేంద్రాన్ని ఒప్పించింది. ఇక్కడ నుంచే ఎంబార్కేషన్ అమలు చేయించింది. అయితే.. ఇప్పుడు దీనిని కేంద్రం రద్దు చేసింది. అంటే.. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలు హైదరాబాద్‌కు వెళ్లి.. అక్కడ నుంచి విమానాలు మారాల్సి ఉంటుంది. ఇది ప్రయాసతో కూడుకున్న పని అని ముస్లింలు చెబుతున్నాయి. కానీ, కూటమి ప్రభుత్వం విమనాలు విజయవాడ నుంచి రద్దు చేసినప్పటికీ.. మౌనంగా ఉండడం, టీడీపీకే చెందిన మంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ విషయంలో స్పందించకపోవడంతో ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.