నల్లారి వారికి కలసి రావడం లేదా ?

ఉమ్మడి ఏపీకి మూడేళ్ళకు తక్కువ లేకుండా సీఎం గా పనిచేసిన వారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.;

Update: 2025-03-22 02:30 GMT
Kiran Kumar Reddy BJP Struggles

ఉమ్మడి ఏపీకి మూడేళ్ళకు తక్కువ లేకుండా సీఎం గా పనిచేసిన వారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయనను ప్రత్యర్ధులు జాక్ పాట్ సీఎం అని కామెంట్స్ చేసినా ఆయనకు దక్కిన లక్ మాత్రం ఎవరికీ ఎప్పటికీ దక్కనిదే. 23 జిల్లాల అతి పెద్ద సౌత్ స్టేట్ కి మూడేళ్ళకు పైగా ముఖ్యమంత్రిగా చేయడం అన్నది నిజంగా గ్రేట్. ఒక విధగా చూస్తే లైఫ్ టైం అచీవ్మెంట్.

అయితే ఈ పదవి తరువాతనే ఆయన రాజకీయం ఆగిపోయింది. గత పదేళ్ళుగా ఆయన ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నా గాడిలో పడడం లేదు. ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. మళ్ళీ చేరారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. ఇక బీజేపీ కూడా ఆయనకు ఎంతో కొంత ప్రాధాన్యత ఇస్తోంది కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ స్టైల్ నే ఇక్కడా అప్లై చేయడంతో అంతగా సెట్ కావడం లేదు అని అంటున్నారు.

ఆయనను రాజంపేట నుంచి బీజేపీ లోక్ సభకు పోటీ చేయించింది. బ్యాడ్ లక్ ఏంటి అంటే కూటమి వేవ్ కుమ్మేసినా నల్లారి వారు మాత్రం డెబ్బై వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడం. దాంతోనే రాయలసీమ జిల్లాలో రెడ్డి గారి పట్టు పలుకుబడి మీద కాషాయం పెద్దలకు డౌట్లు వచ్చాయని అంటున్నారు.

ఇక నల్లారి వారు మాత్రం లోక్ సభ కాకపోతే రాజ్యసభ అని అంటున్నారు. ఏపీలో ఖాళీ అయిన విజయసాయిరెడ్డి రాజ్యసభ సీటులో తాను కుదురుకుపోయి పెద్దల సభలో మెరవాలని భావిస్తున్నారుట. అన్నీ కలసి వస్తే మాజీ సీఎం గా ఉన్న సీనియారిటీతో కేంద్ర మంత్రి కూడా కావచ్చు అని ఆశపడుతున్నారుట.

అయితే బీజేపీ మాత్రం ఆయన విషయంలో అంతలా ఆలోచించడం లేదు అని అంటున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే ప్రయారిటీ అంటోంది అదే సమయంలో నల్లారి వారు బీజేపీ నేతగా పెద్దగా జనంలోకి రావడం లేదు అన్నది కూడా గమనిస్తున్నారుట. పార్టీ కోసం కష్టపడితే అపుడు పదవుల విషయం ఆలోచించవచ్చు అన్నది కమలనాధుల వ్యూహంగా ఉంది అంటున్నారు.

ఇక ఆయన పెద్దగా బీజేపీలో కనిపించకపోవడంతో ఆయన మీద ఇంకా కాంగ్రెస్ నేత అన్న ముద్ర ఉందని అంటున్నారు. ఆయనకు ఇప్పటికీ ఢిల్లీలోని కాంగ్రెస్ పెదలతో మంచి రిలేషన్స్ ఉన్నాయన్నది కూడా ప్రచారంలో ఉందిట. ఆయన విషయంలో బీజేపీ పెట్టుకున్న ఆశలు ఒకటి అయితే ఆయన వల్ల రాయలసీమలో పార్టీ బలపడడం లేదు కూడా భావిస్తున్నారుట.

దాంతో ఆయనకు పదవులు బీజేపీలో దక్కడం అన్నది కష్టంగానే ఉందని అంటున్నారు. కాంగ్రెస్ లో చేసినట్లుగా బీజేపీలో లాబీయింగ్ చేసినా ఫలితం ఉండదని అంటున్నారు. బీజేపీ ఆరెస్సెస్ నుంచి వచ్చిన వారిని విధేయులను నమ్ముతుంది. అలాగే పార్టీకి ఎవరి వల్ల ఎంత లాభం ఏమి మేలు అన్నది పక్కా లెక్కలతో కొలుస్తుంది అని అంటున్నారు. మొత్తానికి నల్లారి వారికి బీజేపీలో అయితే కలిసి రావడం లేదు అని అంటున్నారు. ఆయన బీజేపీలో ఉన్నారంటే సీనియర్ నేతగా ఉన్నారని అనుకోవాల్సిందే అంటున్నారు.

Tags:    

Similar News