లేటు వయసులో ఆ ప్రపంచ కుబేరుడి మరో పెళ్లి?
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.., ఈ వేసవిలో ఇటలీలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.;
మనవళ్లు, మునిమనవళ్లు తిన్నా తరగని ఆస్తి సంపాదించాడు. అమెరికా నుంచి ఇండియా దాకా ‘అమెజాన్’ను బ్రాండ్ లా తీర్చిదిద్దాడు. ఒక రోజు వ్యాపారానికే కోట్లు వచ్చిపడుతాయి. అంత డబ్బుతోనే ప్రపంచ కుబేరుల్లో టాప్ 10లో జెఫ్ బెజోస్ ఉన్నారు. ఈ అమెజాన్ అధినేతకు అన్నీ ఉన్నాయి. కానీ విడాకులతో భార్య లోటు ఏర్పడింది. అందుకే 61 ఏళ్ల వయసులో మరో పెళ్లికి రెడీ అయ్యాడు ఈ కుబేరుడు.. కోటీశ్వరుడు మరీ.. ఎన్నైనా పెళ్లి చేసుకుంటాడు అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. 2023లో తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో నిశ్చితార్థం చేసుకున్న ఆయన త్వరలోనే ఆమెను పెళ్లాడనున్నారని సమాచారం. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.., ఈ వేసవిలో ఇటలీలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.
వెనిస్ నగరంలో ఈ వేడుక జరగనుందని తెలుస్తుండగా, మరికొన్ని వర్గాలు మాత్రం బెజోస్‌కు ఇటలీ తీరంలో ఉన్న 500 మిలియన్ డాలర్ల విలువైన విలాసవంతమైన నౌకలో జూన్‌లో వివాహం జరగవచ్చని పేర్కొంటున్నాయి. గత ఏడాది ఫ్రాన్స్‌లో విహారయాత్రకు వెళ్లిన సమయంలో బెజోస్ లారెన్‌కు దాదాపు 2.5 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 21 కోట్లు) విలువైన గులాబీ రంగు వజ్రాల ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
54 ఏళ్ల లారెన్ శాంచెజ్ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె పలు దాతృత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. బెజోస్ - లారెన్ 2018 నుండి డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే వారి సంబంధం 2019 వరకు బహిరంగంగా వెల్లడి కాలేదు. అదే సంవత్సరం జెఫ్ బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్‌తో 25 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. లారెన్‌తో తన బంధం అధికారికంగా వెల్లడించే వరకు బెజోస్ విడాకుల ప్రక్రియ పూర్తి కాలేదు.
మరోవైపు, లారెన్ శాంచెజ్‌కు గతంలో పాట్రిక్ వైట్‌సెల్‌తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంతేకాకుండా ఆమెకు మాజీ ఎన్‌ఎఫ్‌ఎల్ ఆటగాడు టోనీ గోంజలెజ్‌తో ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ జంట వివాహం గురించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటలీలోని అత్యంత రమణీయమైన ప్రదేశాలలో ఒకటైన వెనిస్‌లో లేదా ఆయన విలాసవంతమైన నౌకలో వీరి వివాహం ఎలా జరగనుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వేడుకకు సంబంధించిన మరిన్ని అధికారిక ప్రకటనలు త్వరలోనే వెలువడతాయని భావిస్తున్నారు.