బాబు మార్క్ మాస్టర్ థాట్...చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా !
ఇపుడు మరో సరికొత్త మాస్టర్ థాట్ తో బాబు జనం ముందుకు వస్తున్నారు.;
టీడీపీ అధినేత చంద్రబాబుని విజనరీ అని ఊరకే అనలేదు. ఆయన మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ఆయన ఆలోచనలు ఎపుడూ రెండు తరాల కంటే ముందుంటాయి. ఆయన భవిష్యత్తు దర్శనం చేస్తారు. ఆయన మది నుంచి జన్మభూమి అన్న కాన్సెప్ట్ రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చింది. దాని వల్ల గ్రామాలు ఎంతో బాగుపడ్డాయి.
ఇపుడు మరో సరికొత్త మాస్టర్ థాట్ తో బాబు జనం ముందుకు వస్తున్నారు. ఇప్పటి దాకా దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ చేయని ప్రయోగం ఇది. ఈ దేశంలో పేదరికం పోవాలి అని నినదించిన వారు ఎంతో మంది ఉన్నారు. వారి కోసం ప్రభుత్వాల తరఫున కొన్ని కార్యక్రమాలను అమలు చేసిన వారు ఉన్నారు.
అయితే పేదరికం సమూలంగా నిర్మిలించేలా ఒక గొప్ప పరిశోధన చేసి మరీ వినూత్న తరహాలో ప్రయోగం చేయబోతున్నారు చంద్రబాబు. ఆయన సరిగ్గా రెండేళ్ళ క్రితం పీ 4 అని చెబితే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అంతే కాదు పేదలు ఉండరాదని తాను ఆలోచించి ఒక పధకాన్ని తెస్తున్నాను అని చెప్పినా ఎవరూ దాని మీద సీరియస్ గా చూడలేదు.
కానీ బాబు ఏపీకి నాలుగవ సారి సీఎం అయ్యాక పీ 4 పేరుతో ఆ పధకాన్ని జనంలోకి తెస్తున్నారు. బహుశా ప్రపంచంలోనే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఎవరూ డిజైన్ చేసి ఉండరేమో. ఈ దేశంలో కానీ సమాజంలో కానీ ఎంతో మంది సంపన్నులు ఉన్నారు. అలాగే పేదలు ఉన్నారు.
సంపన్నులకు తమ సంపదలో ఎంతో కొంత ఇవ్వడం అంటే పెద్దగా కష్టం కాదు. అలాగే పేదలకు తగిన చేయూత ఆసరా ఇస్తే వారు వృద్ధి లోకి రావడం కూడా కష్టం కాదు. మరి ఈ ఇద్దరికీ కలిపేవారు ఇప్పటిదాకా ఎవరూ లేరు సంపన్నులకు తాము ఎంతో కొంత తిరిగి సమాజానికి చేద్దామని ఉంటుంది. కానీ అది ఫలవంతం కావాలని వృధా పోరాదని వారికి ఉంటుంది.
పేదల విషయం తీసుకుంటే ఎవరినీ కోరి వెళ్ళి అడగలేరు. అవసరాలు ఉన్నా వాటిని అలా దాచుకునే ఉంటారు. ఇపుడు ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో సంపన్నులను పేదలను ఒక సంధాన కర్తగా ఉండి కలుపుతోంది. దాని వల్ల పేదలకు ఆర్థికంగా బలమైన ఆసరా దొరుకుతుంది. సంపన్నులకు తాను సమాజానికి సేవ చేసి పేదరికం మీద ఎంతో కొంత యుద్ధం చేసి సక్సెస్ అయ్యామన్న సంతృప్తి ఉంటుంది.
ఈ పీ 4 స్కీం కోసం ఇప్పటికే ప్రభుత్వం తరఫున ప్రతీ జిల్లాలో పేదలు ఎంతమంది ఉన్నారో సర్వే చేయించారు అలా సచివాలయాల ద్వారా చేయించిన ఈ సర్వేల నివేదికలు ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఈ సర్వే మేరకు అత్యంత పేదలుగా ఉన్న కుటుంబాలను ఎంపిక చేసి వారి వివరాలను సంపన్నులకు తెలియచేస్తారు. వీరిలో ఎవరికి సాయం చేయదలచుకుంటున్నారో సంపన్నులు ప్రభుత్వానికి తెలియచేస్తారు.
అలా ఆ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకుని వచ్చే మొత్తం బాధ్యతను ఆ సంపన్న కుటుంబాలు తీసుకుంటాయి. అంటే ఆ కుటుంబానికి చదువు వైద్యం, నివాసం ఇలా అన్నీ చూసుకుంటాయి. అలా ఆ కుటుంబం నుంచి ఒక సంపాదనపరుడు వచ్చేంతవరకూ బాధ్యత వహిస్తారు. దాంతో ఆ కుటుంబం పేదరికం నుంచి బయట పడుతున్నారు.
ఈ విధంగా ఎంపిక చేసిన పేద కుటుంబాలు ఆత్మన్యూనతా భావానికి లోను కాకుండా వారికి బంగారు కుటుంబం అని ప్రభుత్వం పేరు పెడుతోంది. అంటే వారు భవిష్యత్తులో బంగారు కుటుంబంగా మారుతారు అన్న మాట. వారికి సాయం చేసే సంపన్నులకు మార్గదర్శి అని పేరు పెడతారు. వారు ఆ కుటుంబాన్ని ఆదుకుని సమాజానికి మార్గదర్శిగా మారుతారు అన్న మాట.
ఈ ఇద్దరినీ కలపడం వరకే ప్రభుత్వం బాధ్యత. ఆ మీదట బంగారు కుటుంబాలను తయారు చేయాల్సింది సంపన్నులే. ఇక చంద్రబాబు అంటే చాలా మందికి నమ్మకం. మరీ ముఖ్యంగా ఆయన ఏ కార్యక్రమం తలపెట్టిన సంపన్నులు అండగా ఉంటారు. ఇపుడు కూడా పేదలను ఆదుకునేందుకు అనేక సంపన్న కుటుంబాలు ముందుకు వస్తున్నాయి.
ఈ ఏడాది తెలుగు వారి అతి పెద్ద పండుగ అయిన తెలుగు సంవత్సరాది ఉగాది వేళ పీ 4 పేరుతో కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. మొదటి దశలో 20 లక్షల మంది పేద కుటుంబాలను తీసుకుంటున్నారు. వారిని బంగారు కుటుంబాలుగా చేసే బాధ్యతను సంపన్న వర్గాలు చేపడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం అనుసంధానకర్తగా పాత్ర పోషిస్తోంది.
అన్ని పనులూ ప్రభుత్వం చేయలేదు. దాని వల్లనే పేదరికం ఈ దేశంలో ఇంకా ఉంది. దాంతో సంపన్నులు ముందుకు వచ్చి పేదరికం మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. దాంతో ఏపీలో మేలు మలుపు అయిన ప్రగతి భవిష్యత్తులో సాధ్యపడుతుంది అని అంటున్నారు. మొత్తానికి బాబు మదిలో మెదలిన ఈ గొప్ప ఆలోచన దేశానికి ప్రపంచానికి స్పూర్తిగా మారుతుందని అంతా ఆశిస్తున్నారు.