కాకాణికి కాక.. ఏ క్షణంలో అయినా అరెస్టు?
వైసీపీ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి కాక ప్రారంభమైంది.;

వైసీపీ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి కాక ప్రారంభమైంది. కీలకమైన ఆరు కేసుల్లో ఆయన చుట్టూ ఉచ్చు బిగిసుకుంది. ప్రధానంగా మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలోని రుస్తుం మండలంలో ఉన్న మైన్స్ లో క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తరలించారన్నది తొలి కేసు. ఈ పద్దులో ఏకంగా 250 కోట్లకు పైగా కాకాణి, ఆయన కుటుంబం ఖాతాలో పడినట్టు అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ కేసు దాదాపు తెరవెనుక విచారణ పూర్తయింది.
ఇక, టీడీపీసీనియర్ నాయకుడు, ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని బెదిరించిన కేసు పెండింగులో ఉంది. దీనిపైనా అధికారులు విచారణ ప్రారంభించారు. అలాగే.. నెల్లూరు కోర్టులో ఫైళ్లను తగలబెట్టిన కేసు కూడా ఉంది. ఇది కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ.. ఈ ఉదంతాన్ని ప్రోత్సహించా రంటూ.. కాకాణి సహా ఆయన అనుచరులపై కేసులు పెట్టారు. వీటిని విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అలానే.. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులోనూ కాకాణి పేరు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించింది. ఎంపీ సంతకాల ఫోర్జరీ కేసులో సైతం కాకాణి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన అరెస్టు ఖాయమని తెలుస్తోంది. ఇక, సర్వేపల్లి రిజర్వాయర్‌లో గ్రావెల్ కుంభకోణం వెనుక కూడా కాకాణి, ఆయన సోదరుల హస్తం ఉన్నట్లు మైనింగ్ అధికారులు చెబుతున్నారు.
దీనిపై కూడా పరిశీలన చేసి కేసు నమోదు చేయనున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. వనరుల దోపిడీ.. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారన్న ఆరోపణల నేపథ్యంలో త్వరలోనే ఆయనను అరెస్టు చేయ నున్నట్టు నెల్లూరు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండడం గమనార్హం. కాకాణి అరెస్టు అయితే.. కీలకమైన వైసీపీ నాయకుడు అరెస్టు అయినట్టేనని భావిస్తున్నారు. సుమారు 25 సంవత్సరాలుగా.. అప్రతిహతంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి కాకాణి గెలిచిన విషయం తెలిసిందే. గత ఏడాది ఎన్నికల్లోనే ఆయన తొలి పరాజయం చవిచూశారు.