బాబు వరకే పవన్.. సంకేతాలు ఇచ్చేశారా ..!
చంద్రబాబు వరకే పవన్ టీడీపీతో దోస్తీ చేసే అవకాశం ఉందని.. బాబు తర్వాత.. పవన్.. బీజేపీతోనే కలిసి ఉండే అవకాశం ఉందని అంటున్నారు.;

ఏపీలో కూటమి కట్టి పార్టీలను ఏకం చేసి.. వైసీపీని అధికారం నుంచి దించేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పక్కా ప్రణాళికతోనే ముందుకు సాగుతున్నారా? భవిష్యత్తులో ఆయన తన రూట్‌ను తాను వేసు కునేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకున్నారా? అంటే.. రాజకీయ వర్గాల్లో ఔననే సమాధానమే వస్తోంది. చంద్రబాబు వరకే పవన్ టీడీపీతో దోస్తీ చేసే అవకాశం ఉందని.. బాబు తర్వాత.. పవన్.. బీజేపీతోనే కలిసి ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రస్తుతాన్ని వదిలేసి.. భవిష్యత్తుపై ఇప్పుడే ఇంత ప్లాన్ ఎందుకనే చర్చ సహజంగానే తెరమీదికి వస్తుంది. అయితే.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరూ ఊహించలేరు కాబట్టి.. పవన్-బాబుల సయోధ్య వ్యవహారంపైనా ఇప్పుడు అంతే ఆసక్తిగా చర్చ సాగుతోంది. పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు కావొచ్చు.. ఆయన చేస్తున్న పనులు కావొచ్చు.. జనసేనను బలోపేతం చేసుకునేదిశగానే అడుగులు వేస్తున్నారు. అంటే.. ఆయన తను సొంతగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వాస్తవానికి జనసేన అంటే పార్టీ అనేది అందరూ అనుకుంటారు. కానీ, వ్యవస్థీ కృతం కన్నా.. వ్యక్తిగతం చేయడంలోనే పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యక్తిని బట్టి వ్యవస్థ ఎలానూ ఆధారపడి ఉంటుంది కాబట్టి.. తాను సచ్ఛీలుడిగా ఉంటూ.. పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు మాత్రమే పవన్ రెడీ అవుతు న్నారన్నది తెలిసిందే. ఈ క్రమంలో భవిష్యత్తుపైనా ఇదే ధోరణితో ఉన్నారన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. 15 ఏళ్లపాటు మేమే ఉంటాం! అని పదే పదే చెప్పడం వెనుక.. బాబు వరకు మాత్రమే తమ పొత్తు సాగుతుందన్న సంకేతాలు ఇస్తున్నారు.
అయితే.. దీని వెనుక నిజంగానే టీడీపీతో పోత్తును వదులుకుంటారా? అంటే.. అదేమీ కాదు. పొత్తులో ప్రస్తుతం టీడీపీది పైచేయిగా ఉంది. కానీ, పదిహేనేళ్ల తర్వాత.. పొత్తులో జనసేనది పైచేయి కావొచ్చు. తద్వారా.. తామే అధికారం పంచుకునే స్థాయికి చేరుకుంటామన్న సంకేతాలను పవన్ ఇస్తున్నారు. పైగా.. పవన్ సీఎం కావాలన్న కాపుల ఆకాంక్షను ఎంత వరకు తొక్కిపెట్టి ఉంచగలిగితే.. అంత వరకు జనసేనకు తిరుగు ఉండదు. పవన్ ఒక్కసారి సీఎం అయిపోయిన తర్వాత.. ఆయన పాలనేంటో చూసిన తర్వాత.. సహజంగానే ఆ ఇంట్రస్ట్ తగ్గుతుంది. ఈ పరంపరలోనే.. 15 ఏళ్ల వరకు టీడీపీతోనే ఉంటామన్న సంకేతాలు ఆయన పంపిస్తున్నారన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.