బాబే ఎప్పటికీ సీఎం...లోకేష్ సంగతేంటి ?

దానిని బట్టి చూస్తే బాబు మదిలో రిటైర్మెంట్ ఆలోచనలు ఉన్నాయని అంతా అనుకున్నారు.;

Update: 2025-03-25 21:30 GMT

విశాఖలో ఇటీవల జరిగిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రిటైర్మెంట్ లైఫ్ గురించి దగ్గుబాటిని అడిగి తెలుసుకున్నాను అని అన్నారు. దానిని బట్టి చూస్తే బాబు మదిలో రిటైర్మెంట్ ఆలోచనలు ఉన్నాయని అంతా అనుకున్నారు.

నిజంగా కూడా ఆలోచిస్తే బాబు 2029 దాకా సీఎం గా ఉండి తన వారసుడు టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ కి సీఎం గా బాధ్యలు అప్పగించి తెర వెనక నుంచి సలహా సూచనలు ఇస్తారని ప్రచారం ఉంది. ఎందుకంటే ఈ రోజుకి చంద్రబాబు వయసు 75 ఏళ్ళు. మరో అయిదేళ్ళకు ఆయనకు ఎనభై వస్తాయి. ఆయనకు సామర్థ్యం ఉన్నా ఇప్పటి అంతా చురుకుగా ఉండలేరు.

పైగా ఇప్పటి నుంచే ప్రభుత్వ పార్టీ వ్యవహారాలలో లోకేష్ ని కీలకం చేస్తున్నారు. ఆయనకు అన్ని విషయాలూ తెలియాలని బాబు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు అని ప్రచారంలో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే నారా లోకేష్ కి ప్రస్తుతం వయసు 42 ఏళ్ళు. ఆయనకు 2029 నాటికి 46 ఏళ్ళు నిండుతాయి. సీఎం గా అది తగిన వయసు. చంద్రబాబు అయితే 45 ఏళ్ళకు సీఎం అయ్యారు. జగన్ 47 ఏళ్ళకు అయ్యారు.

లోకేష్ కి కూడా ఇంచుమించుగా ఆ ఏజ్ లో ఉన్నత పదవి దక్కితే పది కాలాల పాటు రాణించేందుకు ఆస్కారం ఉంటుంది అని అంతా అంటున్న మాట. అప్పటికి రెండు సార్లు మంత్రిగా చేసి కీలక శాఖల మీద ప్రభుత్వం మీద పట్టు సాధించి సిద్ధంగా ఉన్న లోకేష్ ని 2029లో సీఎం క్యాండిడేట్ గా ప్రమోట్ చేస్తారని ప్రచారంలో ఉన్న మాట.

అయితే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబే 2039 దాకా సీఎం గా ఉండాలని కోరుకుంటున్నారు బాబు ఉంటేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ఆయన అంటున్నారు పవన్ ఈ రకంగా పదే పదే ప్రకటనలు చేయడానికి కారణం పక్కా వ్యూహంతోనే అని అంటున్నారుట.

చంద్రబాబు సీఎం అని అంటే తెలుగుదేశం సానుభూతి వర్గాల నుంచి మద్దతు ఉంటుందని రేపటి రోజున ఆ వర్గాల మద్దతు దక్కే అవకాశం ఉందని జనసేన పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు. అదే సమయంలో లోకేష్ కి కాకుండా బాబుకే మా మద్దతు అని చెప్పకనే చెబుతున్నారని అంటున్నారు. అయితే టీడీపీలో ఇపుడు ఉన్న వర్గాలు కానీ యువతరం కానీ లోకేష్ నే సీఎం గా చూడాలని అనుకుంటున్నారు. బాబు సీఎం గా నాలుగు సార్లు అయ్యారు కాబట్టి 2029లో లోకేష్ ని సీఎం చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. మరి పవన్ చేస్తున్న ఈ ప్రకటనలు టీడీపీ యూత్ టీం కి ఎలా రీ సౌండ్ చేస్తున్నాయో అన్న చర్చ అయితే సాగుతోంది.

Tags:    

Similar News