కొడాలి నానికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..?
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కీలక నేత కొడాలి నాని హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు.;

గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కీలక నేత కొడాలి నాని హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది వెంటనే ఆయనను అత్యవసర వైద్య విభాగానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కొడాలి నాని ఏఐజీ ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగంలో గుండె వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు.
ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి ఆయనను తీసుకువచ్చారు. కొడాలి నాని యాస్ట్రిక్ సమస్యతో ఆస్పత్రిలో చేరారు. అయితే నానికి అక్కడ వైద్యులు పలు వైద్య పరీక్షలు చేశారు. ఈ క్రమంలోనే గుండె సంబంధిత సమస్య ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయం తెలియగానే వైఎస్సార్‌సీపీ అగ్ర నాయకులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆసుపత్రి వర్గాలతో మాట్లాడినట్లు సమాచారం. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, వైద్యం అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
గతంలో గుడివాడ ఎమ్మెల్యేగా పనిచేసిన కొడాలి నాని వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో కీలక నేతగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. కొద్ది రోజుల క్రితం ఆయన తన సన్నిహితుడు వల్లభనేని వంశీ అరెస్టు సందర్భంగా విజయవాడ జైలు వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
కాగా, కొద్ది రోజుల క్రితం కొడాలి నాని అనారోగ్యానికి గురయ్యారనే వార్తలు వచ్చాయి. ఆయన బసవతారకం ఆసుపత్రికి వెళ్లినట్లు కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే, ఆయన అనుచరులు వాటిని ఖండించారు. ప్రస్తుతం కొడాలి నానికి గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్టు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆసుపత్రి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అప్పటివరకూ వేచిచూడాల్సిందే..