బెట్టింగ్ యాప్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్‌ల కేసులపై కీలక నిర్ణయం తీసుకుంది.;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్‌ల కేసులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన అన్ని కేసులను రాష్ట్ర నేర పరిశోధన విభాగం (CID) మాత్రమే విచారించనుంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నమోదవుతున్న అన్ని బెట్టింగ్ యాప్‌ల కేసులను సీఐడీకి బదిలీ చేయనున్నారు.
బెట్టింగ్ యాప్‌ల కేసులను సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు చేయగలదని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా నిరోధించేందుకు కూడా సీఐడీకి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో 11 మంది బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కేసులు నమోదు కాగా, సైబరాబాద్‌లో బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన 25 మంది సెలబ్రిటీలపై కేసులు పెట్టారు.
టాలీవుడ్‌లోని ప్రముఖ హీరోల నుంచి మొదలుకొని చిన్న స్థాయి యూట్యూబర్ల వరకు చాలా మందిపై కేసులు నమోదవుతున్నాయి. కేవలం ప్రమోటర్ల మీదే కాకుండా బెట్టింగ్ యాప్ కంపెనీలపైనా తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కొంతమంది సినీ నటులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తున్నారు. అంతేకాకుండా విదేశాలకు పారిపోయిన వారిని తిరిగి తెలంగాణకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసుల్లో భాగంగా, కొందరు చిన్న స్థాయి యూట్యూబర్లకు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. వారు తిరిగి రాగానే అరెస్టు చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ కేసులో పలువురు సెలబ్రిటీలను పోలీసులు విచారించారు. బుల్లితెర నటీమణులు రీతూ చౌదరి, యాంకర్ విష్ణు ప్రియ, యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మియాపూర్ పోలీసులు ఏయే సెలబ్రిటీలు ఏయే యాప్‌లను ప్రమోట్ చేశారనే వివరాలను సేకరించారు. జంగిల్ రమ్మీ యాప్ కోసం రానా, ప్రకాష్ రాజ్, ఏ23 యాప్ కోసం విజయ్ దేవరకొండ, యోలో 247 యాప్ కోసం మంచు లక్ష్మి, ఫెయిర్ ప్లే లైవ్ యాప్ కోసం హీరోయిన్ ప్రణీత, జీట్ విన్ యాప్ కోసం నిధి అగర్వాల్, ఆంధ్ర 365 యాప్ కోసం నటి శ్యామల పనిచేసినట్లు గుర్తించారు.
ఇప్పుడు ఈ కేసులన్నీ సీఐడీకి బదిలీ కావడంతో రానున్న రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సీఐడీ ఈ కేసులను సమగ్రంగా దర్యాప్తు చేసి, బెట్టింగ్ యాప్‌ల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకుంటుందని భావిస్తున్నారు.