కుక్కల తిండిని వదల్లేదా? జగన్ పాలనలో వెలుగులోకి మరో కుంభకోణం!
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో మరో అవినీతి కుంభకోణం తాజాగా బయటపడింది.;

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో మరో అవినీతి కుంభకోణం తాజాగా బయటపడింది. ఈసారి పోలీసు శాఖలో విధులు నిర్వర్తించే శిక్షణ పొందుతున్న జాగిలాలకు (కుక్కలు) పెట్టే ఆహారంలోనూ నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. నాసిరకమైన ఆహారాన్ని కొనుగోలు చేసి జాగిలాల ఆరోగ్యాన్ని దెబ్బతీశారని, అంతేకాకుండా కుక్క పిల్లల కొనుగోలులోనూ నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వం తాజాగా గుర్తించింది. ఈ నేపథ్యంలో బాధ్యులైన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి అభియోగాలు నమోదు చేసింది. ఈ మేరకు హోంశాఖ ఇన్‌ఛార్జి ముఖ్యకార్యదర్శి జి.విజయ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- డాగ్ స్క్వాడ్ ఇన్‌ఛార్జ్‌గా ఉంటూ అక్రమాలు..
ప్రస్తుతం ఎచ్చెర్ల ఏపీఎస్పీ బెటాలియన్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న టి.శ్రీనివాసరావు, గతంలో 2012 ఫిబ్రవరి నుంచి 2023 మే 3 వరకు రాష్ట్ర స్థాయిలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ISW), స్పెషల్ సెక్యూరిటీ గ్రూపుల్లోని డాగ్ స్క్వాడ్ విభాగానికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. శిక్షణకు అనువైన జాగిలాల ఎంపిక, వాటి కొనుగోలు బాధ్యతలు ఆయన చూసేవారు. ఈ సమయంలో ఆయన నిబంధనలు పాటించకుండా 35 కుక్క పిల్లలను కొనుగోలు చేశారని తేలింది. అంతేకాకుండా, నిర్దేశిత ప్రమాణాలు లేని నాసిరకమైన ఆహారాన్ని కొనుగోలు చేసి వాటికి పెట్టేవారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆహారంలో 8 రకాల పదార్థాలు ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉండటంతో శిక్షణ పొందుతున్న కుక్క పిల్లల ఆరోగ్యం దెబ్బతింది.
దీంతో ఆరు కుక్క పిల్లలను శిక్షణ నుంచి తప్పించి, వాటి స్థానంలో కొత్త వాటిని తీసుకువచ్చారు. అయితే, ఇలా చేయాలంటే హ్యాండ్లర్ల రిక్వెస్ట్ లెటర్, ఇన్‌స్ట్రక్టర్ల అభిప్రాయం, వెటర్నరీ వైద్యుల సర్టిఫికేషన్, ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. కానీ ఈ నిబంధనలేవీ పాటించలేదని గుర్తించారు. దీనివల్ల కొత్తగా తెచ్చిన కుక్క పిల్లలకు వ్యాక్సినేషన్, ఆహారం వంటి వాటి ఖర్చులకు అదనంగా బడ్జెట్ కేటాయించాల్సి వచ్చింది. శిక్షణ కూడా ఆలస్యమైంది. ఈ వ్యవహారం వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 జనవరి 28 నుంచి 2023 ఏప్రిల్ 24 మధ్య జరిగిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావుతో పాటు అప్పట్లో ఐఎస్‌డబ్ల్యూ విభాగం ఎస్పీగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన కె.సూర్యభాస్కర్‌రెడ్డిపైనా ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది.
- ఆయిల్‌లోనూ స్వాహా పర్వం...
కేవలం కుక్కల ఆహారంలోనే కాకుండా, ఐఎస్‌డబ్ల్యూలోని పోలీసు వాహనాలకు కొట్టే ఆయిల్ విషయంలోనూ నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. 2022 మే నుంచి 2023 ఏప్రిల్ మధ్య 8 వాహనాలకు 4,093 లీటర్ల పెట్రోల్ వినియోగించినట్లు రికార్డుల్లో చూపించి నిధులు డ్రా చేసుకున్నారు. అయితే ఆ సమయంలో ఆ వాహనాలు అసలు తిరగనేలేదని తేలింది. అప్పట్లో ఐఎస్‌డబ్ల్యూ మోటారు ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో డీఎస్పీగా పనిచేసి ప్రస్తుతం పీటీవో డీఎస్పీగా ఉన్న డి.కోటేశ్వరరావు, ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఆర్‌ఎస్సైగా పనిచేస్తున్న ఎం.సతీష్‌కుమార్, కాకినాడ బెటాలియన్‌లో ఆర్‌ఎస్సైగా ఎం.కృష్ణను ఈ నిధుల దుర్వినియోగానికి బాధ్యులుగా ప్రభుత్వం పేర్కొంది.
ఐఎస్‌డబ్ల్యూ విభాగం ఎస్పీగా పనిచేసి పదవీ విరమణ చేసిన కె.సూర్యభాస్కర్‌రెడ్డి పర్యవేక్షణ లోపం వల్లే ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఆయన ఇద్దరు ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్ల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం అభియోగాలు మోపింది.
మొత్తానికి జగన్ పాలనలో పోలీసు శాఖలో జరిగిన ఈ తాజా కుంభకోణం సంచలనమైంది. ప్రభుత్వ నిధులు ఏ స్థాయిలో దుర్వినియోగమయ్యాయో తెలియజేస్తోంది. శిక్షణ పొందుతున్న మూగజీవాల ఆహారం విషయంలోనూ కక్కుర్తి పడటం విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.