అమెరికా అయిపోయింది.. ఇప్పుడు యూకే మొదలుపెట్టింది
దాదాపు 40 శాతం దరఖాస్తులను తిరస్కరించి అమెరికా ఒక్కసారిగా విద్యార్థులకు షాక్ ఇచ్చింది.;

బ్రిటన్‌కు ఉన్నత విద్య కోసం వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇది నిజంగా చేదు వార్తే. యూకే వీసా ఛార్జీలను పెంచుతున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. పర్యాటకులతో పాటు, ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం బ్రిటన్‌కు వెళ్లే విద్యార్థులపై ఈ నిర్ణయం మరింత ఆర్థిక భారం మోపనుంది. అమెరికా ఇటీవల విదేశీ విద్యార్థుల వీసా దరఖాస్తులను భారీగా తిరస్కరించడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 40 శాతం దరఖాస్తులను తిరస్కరించి అమెరికా ఒక్కసారిగా విద్యార్థులకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు అదే బాటలో యూకే కూడా పయనిస్తోంది

యూకే ప్రభుత్వం స్టూడెంట్ వీసా, విజిటర్ వీసా సహా అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ కొత్త ఛార్జీలు వచ్చే ఏడాది అంటే 2025 ఏప్రిల్ 9వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు యూకే హోం ఆఫీస్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
-విద్యార్థి వీసాలపై మరింత భారం..
భారతీయులు బ్రిటన్‌లో అడుగు పెట్టాలంటే వీసా తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆరు నెలల గడువు కలిగిన యూకే వీసా ఫీజు 115 పౌండ్లు (రూ.12,749.68) ఉండగా, దానిని 10 శాతం పెంచారు. దీంతో ఇది 127 పౌండ్లకు చేరుకుంది. అదేవిధంగా రెండేళ్ల కాలపరిమితి కలిగిన వీసా రుసుము కూడా పెరిగింది. ఈ పెంపుదల విద్యార్థి వీసాలపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది.
ప్రస్తుతం యూకేలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు (ప్రధాన దరఖాస్తుదారు), వారిపై ఆధారపడిన వారు వీసా కోసం 490 పౌండ్లు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఈ మొత్తం 524 పౌండ్లకు పెరగనుంది. అంటే ఒక్కో విద్యార్థి అదనంగా 34 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ప్రధాన దరఖాస్తుదారులే కాకుండా, చైల్డ్ స్టూడెంట్‌లకు కూడా ఇదే పెంపు వర్తిస్తుంది. దీనివల్ల తక్కువ వ్యవధి ఉన్న కోర్సులు చదవడానికి వెళ్లే విద్యార్థులపై కూడా ప్రభావం పడనుంది. ఆరు నెలల నుంచి 11 నెలల స్వల్ప కాలపరిమితి కలిగిన ఇంగ్లీష్ కోర్సులు చదవడానికి వెళ్లే విద్యార్థులు ప్రస్తుతం చెల్లిస్తున్న ఫీజుకు అదనంగా 14 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది.
-అమెరికా బాటలోనే యూకే.. విద్యార్థుల్లో ఆందోళన
ఇటీవల అమెరికా వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో చాలా మంది విద్యార్థులు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు యూకే కూడా వీసా ఫీజులు పెంచడం విద్యార్థుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే విదేశాల్లో చదువుకోవడం అంటేనే ఆర్థికంగా ఎంతో భారం. దీనికి తోడు వీసా ఫీజులు పెరగడం మరింత ఇబ్బందికరంగా మారనుంది. ముఖ్యంగా మధ్యతరగతి , తక్కువ ఆదాయ వర్గాల విద్యార్థులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను స్పష్టంగా వెల్లడించనప్పటికీ, ఆర్థిక పరిస్థితులు.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలు దీనికి కారణం కావచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ పెంపుదల యూకేలోని విద్యా సంస్థల్లో చేరాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై ప్రభావం చూపుతుందా లేదా అనేది వేచి చూడాలి.
మొత్తానికి అమెరికా తర్వాత ఇప్పుడు యూకే కూడా వీసా నిబంధనలను కఠినతరం చేయడం లేదా ఫీజులు పెంచడం వంటి చర్యలకు పాల్పడుతుండటం విద్యార్థులకు అంత శుభసూచకం కాదు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ ప్రణాళికలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఇతర దేశాలు కూడా ఇదే తరహా విధానాలను అనుసరించే అవకాశం లేకపోలేదు. కాబట్టి, విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది.