బాబు కేబినెట్ లో ఆ లోటు కొట్టొచ్చినట్టు ?
ప్రత్యర్ధులు ఇక మళ్ళీ నోరెత్తకుండా ఉండేలా ధీటైన జవాబు ఇవ్వడంలో టీడీపీ నేతలు ఆరితేరారు.;
తెలుగుదేశం పార్టీ అంటేనే ఫార్టీ ఇయర్స్ హిస్టరీ. తెలుగుదేశంలో పుట్టి పెరిగి రాజకీయం నేర్చి ఢక్కామెక్కీలు తిన్న వారు ఎంతో మంది ఉన్నారు. టీడీపీ నేతలు చేసే విమర్శలు కానీ ఇచ్చే కౌంటర్లు కానీ ఎంతో అర్ధవంతంగా ఉంటాయి. ప్రత్యర్ధులు ఇక మళ్ళీ నోరెత్తకుండా ఉండేలా ధీటైన జవాబు ఇవ్వడంలో టీడీపీ నేతలు ఆరితేరారు.
అయితే గత పది నెలల టీడీపీ ప్రభుత్వంలో మాత్రం చాలా లోటు కనిపిస్తోంది అని అంటున్నారు. ఈసారి చంద్రబాబు ప్రభుత్వంలో అంతా కొత్తవారే ఉన్నారు. అక్కడక్కడ సీనియర్లు ఉన్నా వారికి ఇచ్చిన శాఖల బట్టి వారు పరిమితమైన పాత్రలలో ఉన్నారు. దాంతో బాబు కేబినెట్ లో సీనియర్ల లోటు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు.
ఏపీలో 164 సీట్లతో బంపర్ మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చింది. బాబు కూడా తన శక్తికి మించి పనిచేస్తున్నారు. లోకేష్ కూడా బాగా రాటుదేలారు. అన్ని విధాలుగా అండగా ఉంటూ వస్తున్నారు అయితే టీడీపీ కూటమి మీద అపుడే జనంలో అసంతృప్తి వస్తోంది అని అంటున్నారు. దానికి కారణాలు ఏమీ లేవు.
ప్రత్యర్ధి పార్టీలే అలా ప్రచారం చేస్తున్నాయి. సూపర్ సిక్స్ హామీలేవీ అని వైసీపీ నిగ్గదీస్తోంది. ఏపీలో పాలన లేదని అంటోంది. రెడ్ బుక్ రాజ్యాంగం సాగుతోందని ఆరోపిస్తోంది. ఈ మధ్యనే కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇక వామపక్షాలు సైతం కూటమి పనితీరు మీద తమదైన శైలిలో ఆరోపిస్తున్నారు.
అయితే వీటికి ధీటుగా జవాబు ఇచ్చే పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వంలో లేదని అంటున్నారు. మంత్రులు కూడా తమకు సంబంధించిన శాఖలలో విమర్శల మీద ధాటీగా విపక్షాలకు కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు అని అంటున్నారు. అదే 2014 నుంచి 2019 మధ్యలో చూస్తే అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, యనమల రామక్రిష్ణుడు, గంటా శ్రీనివాసరావు, కేఈ క్రిష్ణ మూర్తి, నిమ్మకాయల చిన రాజప్ప, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా చాలా మంది మంత్రులు ఉండేవారు.
వారు ప్రభుత్వం మీద విమర్శలు వస్తే అసలు సహించేవారు కాదు, అంతే కాదు బాబు మీద ఈగ వాలనిచ్చేవారు కాదు. ఇపుడు చాలా మంది కొత్తవారు అయినందువల్ల ఏమి మాట్లాడితే ఏమి అవుతుందన్నది కూడా ఉండడంతో కీలకమైన సమయంలో మౌనం వహిస్తున్నారు అన్న ప్రచారం ఉంది. అదే విధంగా ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలు కూడా గట్టిగా చెప్పుకోలేక పోతున్నారు అని అంటున్నారు.
దాంతో అన్ని విషయాల్లో చంద్రబాబు సహా ముఖ్య నేతలు ముందుకు రావాల్సి వస్తోంది అని అంటున్నారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగింది. దాని మీద అందరినీ ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. బాబు కూడా భరోసా ఇచ్చారు. అయితే విపక్షాలు మాత్రం రైతులను గాలికి వదిలేశారు అని ప్రచారం మొదలెట్టారు. మరి ఇదే జనంలోకి పోయేలా ఉంది అని అంటున్నారు.
కీలకమైన స్థానాలలో ఉన్న వారు బాధ్యతగా ఉన్న వారు సరైన సమయంలో మాట్లాడాలని విపక్షానికి ధీటైన కౌంటర్లు ఇస్తూనే వాస్తవాలు ప్రజలకు వివరించాలని అంటున్నారు. ప్రభుత్వం చేసే మంచిని జనంలో ఉంచాల్సిన బాధ్యత తీసుకోకపోతే ప్రతిపక్షాలు చెప్పేదే నిజమని నమ్మే సీన్ ఉండొచ్చని అంటున్నారు.