వరల్డ్ నెంబర్ 2 టెన్నిస్ స్టార్ కు వేధింపులు... అధికారుల కీలక నిర్ణయం!
ఈ సమయంలో.. పోలెండ్ కు చెందిన వరల్డ్ నెంబర్ 2 ఇగా స్వైటెక్ కు వేధింపులు తప్పలేదు.;

వేధింపుల బారిన పడే విషయంలో సామాన్య మహిళలు, సెలబ్రెటీలు అనే తేడాలేమీ లేదు.. అమ్మాయి కనిపిస్తే వేధింపులు చేసే అల్లరి మూకలకు ఏ దేశంలోనూ కొదువ లేదు. ఈ సమయంలో.. పోలెండ్ కు చెందిన వరల్డ్ నెంబర్ 2 ఇగా స్వైటెక్ కు వేధింపులు తప్పలేదు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
అవును... వరల్డ్ నెంబర్ 2 టెన్నిస్ క్రీడాకారిని అయిన ఇగా స్వైటెక్ ఇటీవల ప్రాక్టీస్ లో ఉన్న సమయంలో ఓ ప్రేక్షకుడు ఆమెను అసభ్య పదజాలంతో దూషించినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా.. మియామి ఓపెన్ లో ఆమెకు అదనపు భద్రత కేటాయించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా స్పందించిన ఇగా స్వైటెక్ ప్రతినిధి... ఈ విషయాన్ని టోర్నమెంట్ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లామని.. వారు వెంటనే తమ క్రీడాకారిణికి సెక్యూరిటీని పెంచడం వంటి అదనపు జాగ్రత్తలు తీసుకున్నారని.. క్రీడాకారిణుల సెక్యూరిటీ అత్యంత ప్రాధాన్యమైన విషయమని.. ఇటువంటి సమస్యను పరిష్కరించడానికి నిత్యం కృషి చేస్తున్నామని అన్నారు.
ఇదే సమయంలో.. క్రీడాకారిణులు ప్రాక్టీస్ లో, ఆటలో ఉన్న సమయంలో ఇతరులు చేసే ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు వారిని ఆందోళనకు, అసౌకర్యానికి గుర్తి చేస్తాయని.. ఆ ప్రభావం వారి పెర్పార్మెన్స్ ని ప్రభావితం చేస్తుందని.. అందువల్ల వీటిని నివారించడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
మరోపక్క ఈ విషయంపై స్పందించడానికి మహిళల టెన్నిస్ అసోసియేషన్ నిరాకరించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని టోర్నమెంట్ నిర్వాహకులను ఆదేశించింది.
కాగా... దుబాయ్ ఓపెన్ సందర్భంగా గత నెలలో బ్రిటీష్ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పోలెండ్ కు చెందిన వరల్డ్ నెంబర్ 2 క్రీడాకారిణి ఇగా స్వైటెక్ కు ఇలాంటి అసౌకర్యం కలిగింది. దీంతో... అధికారులు అప్రమత్తమయ్యారు.