35 ఏళ్లుగా జీవిస్తున్నా.. తప్పని అమెరికా బహిష్కరణ

తాజాగా, కాలిఫోర్నియాలో 35 ఏళ్లుగా జీవిస్తున్న కొలంబియాకు చెందిన గ్లాడీస్ గొంజాలెజ్ (55), నెల్సన్ గొంజాలెజ్ (59) దంపతులు ఊహించని విధంగా డిపోర్టేషన్‌కు గురయ్యారు.;

Update: 2025-03-26 16:30 GMT
35 ఏళ్లుగా జీవిస్తున్నా.. తప్పని అమెరికా బహిష్కరణ

గత 35 ఏళ్లుగా వారు అమెరికాలోనే తమ జీవితాన్ని కొనసాగించారు. వారి పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు, వారికి ఉద్యోగాలు వచ్చాయి. గ్లాడీస్ గొంజాలెజ్, నెల్సన్ గొంజాలెజ్ ఇప్పుడు వృద్ధులైపోయారు. తమ పిల్లలతో, వారి పిల్లల స్నేహితులతో ఒక పెద్ద కుటుంబంలా కలిసిపోయారు. అమెరికా వారి సొంత ఇల్లు అయిపోయింది.కానీ వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ట్రంప్ తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌పై సమస్యలు మొదలయ్యాయి. వారికి సరైన పత్రాలు లేకపోవడంతో బహిష్కరణ నోటీసులు అందాయి. తమ పిల్లలను, మనుమలను వదిలి ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వచ్చిన కొలంబియాకు తిరిగి అధికారులు ఈ జంటను పంపించడం అందరినీ కలిచివేసింది. మూడున్నర దశాబ్దాల క్రితం అమెరికా కలలతో అడుగుపెట్టిన ఈ జంట, ఇప్పుడు తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోయారు. అసలు కొలంబియాలో ఏమీ లేని జంట ఇప్పుడు తమ పాత దేశంలో ఎలా బతకాలో తెలియక సతమతమవుతున్నారు. ట్రంప్ వలసవాద నిర్ణయాలు చాలా కుటుంబాలకు తీరని శోకాన్ని కలిగిస్తున్నాయనడానికి వీరి స్టోరీ ఒక నిజమైన ఉదాహరణగా చెప్పొచ్చు.

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని వెనక్కి పంపించేందుకు ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎన్నో కుటుంబాలను కలచివేస్తున్నాయి. తాజాగా, కాలిఫోర్నియాలో 35 ఏళ్లుగా జీవిస్తున్న కొలంబియాకు చెందిన గ్లాడీస్ గొంజాలెజ్ (55), నెల్సన్ గొంజాలెజ్ (59) దంపతులు ఊహించని విధంగా డిపోర్టేషన్‌కు గురయ్యారు. సరైన పత్రాలు లేవనే కారణంతో వారిని స్వదేశానికి పంపించడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వచ్చిన గ్లాడీస్, నెల్సన్ దంపతులు కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. ఇన్నేళ్లలో వారికి ముగ్గురు పిల్లలు జన్మించారు. ఎలాంటి నేర చరిత్ర లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న ఈ జంటను ఇటీవల అధికారులు తనిఖీల్లో భాగంగా అరెస్టు చేశారు. వారి వద్ద సరైన వీసాలు లేదా ఇతర అనుమతి పత్రాలు లేకపోవడంతో వారిని నిర్బంధంలో ఉంచారు. సుమారు మూడు వారాల పాటు నిర్బంధించిన అనంతరం వారిని కొలంబియాకు తిప్పి పంపేశారు.

తమ తల్లిదండ్రులు 35 ఏళ్లుగా అమెరికాలోనే ఉంటూ, ఇక్కడి సమాజంలో భాగమయ్యారని వారి కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం తమను తీవ్రంగా షాక్‌కు గురిచేసిందని వారు తెలిపారు. తమ తల్లిదండ్రులు ఇన్నేళ్లలో ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా జీవించారని వారు గుర్తు చేసుకున్నారు.

ఎటువంటి నేర చరిత్ర లేని, ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఈ దంపతులను ఇన్నేళ్ల తర్వాత స్వదేశానికి పంపించడం వారి కుటుంబ సభ్యులతో పాటు వారి సన్నిహితులను కూడా తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన అమెరికాలోని వలస విధానాలపై మరోసారి చర్చకు దారితీసింది.

Tags:    

Similar News