ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా.. లాభం మాత్రం ఎస్ బీఐకే!
ఏటీఎంల ద్వారా క్యాష్ విత్ డ్రా చేసే అంశానికి సంబంధించి బ్యాంకుల వాదన ఒకలా.. ఖాతాదారుల వాదన మరోలా ఉంటుంది.;

ఏటీఎంల ద్వారా క్యాష్ విత్ డ్రా చేసే అంశానికి సంబంధించి బ్యాంకుల వాదన ఒకలా.. ఖాతాదారుల వాదన మరోలా ఉంటుంది. తమకు అవసరమైన సమయంలో ఏటీఎం ద్వారా నగదును తీసుకునే వెసులుబాటు కల్పించేందుకు డబ్బులు వసూలు చేయటం తెలిసిందే. తమ సొమ్మును బ్యాంకు నుంచి విత్ డ్రా చేయటానికి రుసుము (ఒక పరిమితి దాటిన తర్వాత) వసూలు చేయటంపై పలువురు ప్రశ్నిస్తుంటారు.
అయితే.. విత్ డ్రా కారణంగా బ్యాంకులకు భారమేనని చెబుతారు. దీనికి కారణం ఏటీఎంల నిర్వహణతోపాటు.. ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన ఇంటర్ ఛేంజ్ ఫీజులు కూడా కారణం. ఈ అంశంలో అన్ని బ్యాంకులు నష్టపోతుంటే.. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ)మాత్రం లాభపడుతున్న వైనం వెలుగు చూసింది.
ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసే అంశంలో నష్టపోని ఏకైక ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్ బీఐ అన్న విషయం లోక్ సభలో సభ్యుడు ఒకరు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సమాధానం ఇచ్చింది. ప్రస్తుత పరిమితి తర్వాత ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకునే వేళ.. వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేయటం తెలిసిందే. ఇతర బ్యాంకుల నుంచి నికర ఇంటర్ ఛేంజ్ ఫీజులు కూడా వస్తున్నాయి.
2023-24లో ఈ లావాదేవీలతో ఆదాయం పొందిన ఏకైక ప్రభుత్వ బ్యాంకు గా ఎస్ బీఐ నిలిచినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ ఛౌధ్రీ పేర్కొన్నారు. ఈ ఫీజుల ద్వారా ఎస్ బీఐ రూ.331 కోట్ల ఆదాయం లభిస్తే.. మిగిలిన పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.925 కోట్లు నష్టపోయినట్లుగా పేర్కొన్నారు. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఏటీఎం విత్ డ్రా ద్వారా ఎస్ బీఐకు రూ.2043 కోట్లు లాభపడితే.. మిగిలిన బ్యాంకులు రూ.3739 కోట్లు నష్టపోయాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.824 కోట్లు.. యూనియన్ బ్యాంక్ రూ.669 కోట్లు.. ఇండియన్ బ్యాంక్ రూ.633 కోట్లు చొప్పున నష్టపోయినట్లుగా పేర్కొన్నారు.