షాకింగ్ గా మారిన అలహాబాద్ ట్రిపుల్ ఐఐటీలో తెలుగు కుర్రాళ్ల మరణాలు

అలహాబాద్ ఐఐటీలో చదువుతున్న ఇద్దరు తెలుగు విద్యార్థుల మరణ విషాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.;

Update: 2025-04-01 04:13 GMT
Telugu Students Passed Away In IIIT Allahabad

అలహాబాద్ ఐఐటీలో చదువుతున్న ఇద్దరు తెలుగు విద్యార్థుల మరణ విషాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు గుండెపోటుతో మరణించగా.. మరొకరు ఆత్మహత్య చేసుకున్న వైనం కలకలాన్ని రేపుతోంది. రంగారెడ్డి జిల్లా మాడ్గులకు చెందిన కాట్రావత్ రాజూనాయక్.. దేవి దంపతుల కుమారుడు 21 ఏళ్ల అఖిల్ అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి 9 గంటల వేళలో గుండెపోటుతో కుప్పకూలాడు.

మరోవైపు క్రిష్ణా జిల్లాకు చెందిన స్వర్ణలత.. క్రిష్ణ దంపతులు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యానారాయణపురం గ్రామంలో హోటల్ నిర్వహిస్తుంటారు. నిత్యం కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తుంటారు. వీరి పెద్ద కొడుకు మాదాల రాహుల్ చైతన్య జేఈఈలో జాతీయ స్థాయిలో 52వ ర్యాంక్ సాధించాడు. గత ఏడాది అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో చేరాడు. దివ్యాంగుడైన చైతన్య ఆత్మహత్య చేసుకున్న వైనం పెను విషాదంగా మారింది.

అందరితో పాటు రూంకు వెళ్లి పడుకున్న చైతన్య.. అందరూ నిద్ర పోయిన తర్వాత అర్థరాత్రి వేళలో హాస్టల్ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. దీంతో.. అక్కడికక్కడే మరణించాడు. ఇటీవల జరిగిన సెమిస్టర్ పరీక్షలో ఫెయిల్ అయినందుకు మనస్తాపానికి గురైనట్లుగా చెబుతున్నారు. ఇక.. మరణించిన రాహుల్.. అఖిల్ ఇద్దరు క్యాంపస్ లో చేరినప్పటి నుంచి మంచి స్నేహితులుగా చెబుతున్నారు.

మరోవైపు అఖిల్ మరణాన్ని తట్టుకోలేకనే చైతన్య ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని సహచర విద్యార్థులు చెబుతున్నారు. చెవుడు.. మూగతో ఇబ్బంది పడే రాహుల్ కు అఖిల్ అండగా ఉండేవాడు. ఇదిలా ఉంటే ట్రిఫుల్ ఐటీ క్యాంపస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలు చనిపోయినట్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు వేర్వేరుగా ఆందోళన చేపట్టారు. ఈ ఇద్దరు విద్యార్థుల మరణంపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కు క్యాంపస్ ఒప్పుకొంది. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని వర్సిటీ అధికారులు వెల్లడించారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ రోజు వ్యవధిలో మరణించిన వైనం క్యాంపస్ లో పెను విషాదానికి కారణమైంది.

Tags:    

Similar News