ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో శ్రవణ్ రావు ఏం చెప్పారు?

గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీఎస్పీ ప్రణీత్ రావుతో టచ్ లోకి వెళ్లినట్లుగా శ్రవణ్ రావు అంగీకరించినట్లుగా తెలుస్తోంది.;

Update: 2025-03-30 08:43 GMT
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో శ్రవణ్ రావు ఏం చెప్పారు?

సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందా? గత పాలకులకు తలనొప్పిగా మారిన ఈ కేసు.. తాజాగా కొత్త మలుపు తిరగనుందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. తాజాగా పోలీసుల విచారణకు హాజరైన ట్యాంపింగ్ కేసులో కీలక నిందితుడు.. మీడియా చానల్ అధినేత శ్రవణ్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసును కొత్తమలుపు తిరిగేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీఎస్పీ ప్రణీత్ రావుతో టచ్ లోకి వెళ్లినట్లుగా శ్రవణ్ రావు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకు వచ్చిన నాటి నుంచి విదేశాల్లో ఉండిపోయిన శ్రవణ్ రావు.. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెనుక గేటు నుంచి వెళ్లిన శ్రవణ్ రావును ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసుల టీం ఆరు గంటలు దర్యాప్తు చేశారు.

ఒక ఐటీ కంపెనీ నుంచి పరికరాల్ని శ్రవణ్ రావు కొనుగోలు చేసి పోలీసులకు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సదరు పరికరాల కొనుగోలుకు డబ్బులు ఎవరిచ్చారు? అప్పటి ఎస్ బీఐ చీఫ్ ప్రభాకర్ రావు.. టాస్క్ ఫోర్సు డీసీపీ రాధాకిషన్ రావును ఎవరు పరిచయం చేశారు? డీఎస్పీ ప్రణీత్ రావు తరచూ ఆఫీసుకు ఎందుకు వచ్చారు? మునుగోడు.. దుబ్బాక ఉప ఎన్నికల వేళలో కొంతమంది కాంగ్రెస్ నేతలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. సెలబ్్రిటీల ఫోన్ నెంబర్లు ఎస్ బీఐ.. టాస్క్ ఫోర్సుకు ఇచ్చారా? ఆ నంబర్లను ఎలా సేకరించారు? గత ప్రభుత్వంతో ప్రత్యక్షంగా సంబంధం లేనప్పటికి.. ఇంత సున్నితమైన అంశాల్లో మీరెందుకు ఉన్నారు? లాంటి ప్రశ్నలు ఎదురైనట్లుగాచెబుతున్నారు.

మిగిలిన వారి మాదిరే ఈ కేసులో విచారణ అధికారులు అడిగిన ప్రశ్నలకు శ్రవణ్ రావు సూటిగా సమాధానాలు చెప్పలేదని చెబుతున్నారు. ఆరుగంటల పాటు విచారణ సాగినప్పటికి.. పోలీసులకు పెద్దగా సహకరించలేదని సమాచారం. ముఖ్యంగా రాజకీయ సంబంధాల గురించి.. వారితో ఉన్న బంధం గురించి ప్రశ్నించగా.. ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు అన్న మాట తప్పించి.. శ్రవణ్ రావు నోటి నుంచి మరెలాంటి మాట రాలేదని చెబుతున్నారు. అతడి వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేశారు. ఏప్రిల్ 2న మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఒకవేళ తదుపరి విచారణలో శ్రవణ్ రావు నోరు విప్పితే మాత్రం సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News