సర్వే సంచలనం : తమిళనాడు కొత్త సీఎం ఆయనే ?
దేశంలో మరో ఆసక్తికరమైన ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీలకు 2026 మే నెలలో ఎన్నికలు ఉన్నాయి.;

దేశంలో మరో ఆసక్తికరమైన ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీలకు 2026 మే నెలలో ఎన్నికలు ఉన్నాయి. ఈ రెండు చోట్ల ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో దాదాపుగా అధికారంలోకి వచ్చేసినంతగా సీన్ క్రియేట్ చేసింది బీజేపీ.
కానీ చివరికి 2016లో కంటే ఎక్కువ సీట్లు సాధించి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ కూడా 70 దాకా సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇక తమిళనాడు విషయానికి వస్తే బీజేపీ అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుని పోటీకి దిగాయి. అయితే డీఎంకే 133 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అన్నాడీఎంకే 66 సీట్లు బీజేపీ 4 సీట్లతో సంతృప్తి పడాల్సి వచ్చింది.
ఇక 2026లో జరిగే ఎన్నికల్లో ఎవరు విజేత అన్నది అంతటా ఆసక్తిని రేపుతోంది. ఎందుకంటే అయిదేళ్ళ డీఎంకే పాలన మీద ఎంతో కొంత యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. ఇక సినీ దళపతి విజయ్ కొత్త పార్టీతో జనం ముందుకు వస్తున్నారు. ఆయనకు అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. దాంతో ఆయన పార్టీ టీవీకే మీద కూడా చాలా మందికి ఆసక్తి ఉంది.
ఇంకో వైపు చూస్తే అన్నాడీఎంకే బీజేపీ ఎంపీ ఎన్నికల్లో విడిగా పోటీ చేశాయి. కానీ 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు మరోసారి పొత్తు పెట్టుకున్నాయి. దాంతో గ్రౌండ్ లెవెల్ లో బలమైన క్యాడర్ తో పాటు గట్టి పునాదులు ఉన్న అన్నాడీఎంకే బీజేపీ కాంబో ఈ ఎన్నికల్లో ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది అన్న చర్చ కూడా ఉంది.
ఈ నేపథ్యంలో తమిళనాడుకు ఎన్నికలు జరిగితే ఎవరు కొత్త సీఎం అన్నది అతి పెద్ద ప్రశ్నగా ఉంది. దాని మీద సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే కనుక తమిళనాడుకు స్టాలిన్ మరోసారి సీఎం అవుతారని ఆ సర్వే వెల్లడించింది.
స్టాలిన్ పాలన బాగుందని ఎక్కువ మంది మొగ్గు చూపారు ఆయనే మళ్ళీ సీఎం కావాలని గట్టిగా కోరుతున్నారు. ఆయన తరువాత ప్లేస్ లోకి మాత్రమే టీవీకే అధ్యక్షుడు సినీ దళపతి విజయ్ వచ్చారు. సీఎం గా ఎవరు ఉండాలన్న దాని మీద 27 శాతం మంది స్టాలిన్ పేరుని ప్రస్తావించారు. 16 శాతం మంది మాత్రమే విజయ్ కి మద్దతు ఇచ్చారు. 10 శాతం మంది అన్నా డీఎంకే అధినేత మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామికి మద్దతు ఇస్తే 9 శాతం మంది బీజేపీ తమిళనాడు ప్రెసిడెంట్ అన్నామలైకి సపోర్టుగా నిలిచారు.
ఇక డీఎంకే అయిదేళ్ళ పాలన మీద యాభై శాతం మంది మద్దతుగా నిలవడం స్టాలిన్ సాధించిన విజయంగానే చెప్పాలని అంటున్నారు. ఇందులో అత్యంత సంతృప్తిని వ్యక్తం చేసిన వారు 15 శాతం ఉంటే 36 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. 25 శాతం మంది మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం గా స్టాలిన్ పనితీరు అద్భుతం అని 22 శాతం మంది చెబితే 33 శాతం మంది సంతృప్తి కరంగా ఉందని చెప్పారు. ఇలా టోటల్ గా చూస్తే కనుక స్టాలిన్ పాలన పట్ల తమిళనాడు ప్రజలు బాగానే సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు.
ఆయనను ఓడించేందుకు అన్నాడీఎంకే బీజేపీ జట్టు కట్టినా లేక కొత్త పార్టీ పేరుతో విజయ్ ముందుకు వచ్చినా ఏ ఇబ్బంది లేదని ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 2011, 2016లలో రెండు సార్లు వరసగా అన్నాడీఎంకేకు జయలలిత నాయకత్వానికి జనాలు మద్దతు ఇచ్చి వరసగా గెలిపించారు. ఈసారి కూడా అదే రిపీట్ అయి స్టాలిన్ మరోసారి సీఎం అవడం ఖాయమని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. మొత్తానికి సీఎం గా స్టాలిన్ తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నారు అనే అంటున్నారు.