జమిలి ఎన్నికలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనా?

దేశంలో ఇప్పుడు ఎక్కడ విన్నా జమిలి ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. కేంద్రంలోని అధికార బీజేపీ ఈ దిశగా పకడ్బందీగా పావులు కదుపుతోంది.;

Update: 2025-03-30 10:30 GMT
Venkaiah Naidu Criticizes Congress

దేశంలో ఇప్పుడు ఎక్కడ విన్నా జమిలి ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. కేంద్రంలోని అధికార బీజేపీ ఈ దిశగా పకడ్బందీగా పావులు కదుపుతోంది. మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కమిటీ ద్వారా నివేదిక తెప్పించుకుంది. ఇక బీజేపీ అనుకూల పార్టీలు జమిలికి అనుకూలంగా ప్రకటనలు చేస్తుండగా, విపక్ష శిబిరం ఇండి కూటమి బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. జమిలి ఎన్నికలను అంగీకరించమంటూ తేల్చిచెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జమిలి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అయితే జమిలి ఎన్నికలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో జమిలి ఎన్నికలు కొత్త కాదన్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రస్తుతం ఈ పరిస్థితి రావడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమంటూ ఆరోపించారు. జమిలి ఎన్నికలకు తూట్లు పొడిచిన కాంగ్రెస్ ఇప్పుడు జమిలి ప్రతిపాదనకు వ్యతిరేకంగా సాగుతోందని ఆక్షేపించారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్రాముఖ్యత - సవాళ్లు - ప్రభావం పేరిట విజయవాడలో శనివారం నిర్వహించిన కీలక సదస్సులో వెంకయ్య ప్రసంగించారు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికలు 1952లో జరిగాయని ఆయన గుర్తు చేశారు. నాడు పార్లమెంటు ఎన్నికలతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న జమిలి ఎన్నికలే జరిగాయని ఆయన తెలిపారు. అప్పటి నుంచి 15 ఏళ్లపాటు అంటే 1952 ఎన్నికలతో కలుపుకుంటే 4 సార్వత్రిక ఎన్నికలు జమిలి పద్ధతిలోనే జరిగాయని ఆయన గుర్తు చేశారు.

అయితే నాడు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ నేత ఇందిరా గాంధీ దేశంలోని పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ప్రభుత్వాల్లో తనకు నచ్చని ప్రభుత్వాలను నిర్ణీత కాలం కంటే ముందుగానే రద్దు చేసుకుంటూ వెళ్లిపోయారని వెంకయ్య ఆరోపించారు. అలా ప్రభుత్వాలు రద్దు అయిపోయిన రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు ముందే ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. వెరసి జమిలి అనేది కొత్త పద్ధతి కాదన్న వెంకయ్య దేశంలో ఆది నుంచి అదే పద్ధతి కొనసాగిందని గుర్తు చేశారు. నాడు జమిలి ఎన్నికల పద్ధతికి తూట్లు పొడిచింది కాంగ్రెస్సేనని ఆరోపించిన వెంకయ్య ఇప్పుడు అదే పద్ధతి తీసుకొస్తామంటే అదే పార్టీ అడ్డుకుంటూ ఉండటం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News