బహుపరాక్ హైదరాబాదీ పేసర్.. ఇలాగైతే ఐపీఎల్ నుంచి కూడా ఔట్...
2018 నుంచి మొదలైనా 2020-21 సీజన్ నుంచి సిరాజ్ మొన్నటివరకు వెనక్కు తిరిగి చూసుకోలేదు.;

మొహమ్మద్ అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు, హనుమ విహారీ, తిలక్ వర్మ వంటి గొప్ప బ్యాట్స్ మెన్ తప్ప హైదరాబాద్ నుంచి నాణ్యమైన ఒక పేసర్ టీమ్ ఇండియా కు ఆడితే చూడాలని చాలామంది క్రికెట్ అభిమానులు భావించారు. ఆ లోటును తీరుస్తూ ఆరేడేళ్ల కిందట దూసుకొచ్చాడు మొహమ్మద్ సిరాజ్.
2018 నుంచి మొదలైనా 2020-21 సీజన్ నుంచి సిరాజ్ మొన్నటివరకు వెనక్కు తిరిగి చూసుకోలేదు. టీమ్ ఇండియాలో ప్రధాన పేస్ బౌలర్ గా ఎదిగాడు. మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా లేని సమయంలో సిరాజ్ జట్టు పేస్ భారం మోశాడు.
అయితే, తీరిక లేని క్రికెట్ కారణంగానో.. బంతి పాతబడ్డాక వికెట్లు తీయలేకపోవడంతోనో సిరాజ్ ఆరు నెలల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి సిరాజ్ మూడు ఫార్మాట్లు ఆడాడు. దీంతో అతడిపై తీవ్రమైన పనిభారం పడింది. ఇది చివరకు ప్రదర్శనను ప్రభావితం చేసింది.
2023 వన్డే ప్రపంచ కప్ అనంతరం సిరాజ్ క్రమంగా వెనుకబడ్డాడు. అయితే, జట్టు అవసరాల రీత్యా అతడు అదనపు భారం మోసిన మాట వాస్తవం. దీనిని సెలక్టర్లు కూడా గమనించారు. కాగా, సిరాజ్ ను ఇటీవల వన్డే ఫార్మాట్ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. బుమ్రా గాయంతో అందుబాటులో లేకున్నా.. షమీ అప్పుడే గాయం నుంచి కోలుకున్నా సిరాజ్ ను చాంపియన్స్ ట్రోఫీకి తీసుకెళ్లలేదు. దీంతోనే అతడిని కాస్త పక్కనపెట్టినట్లు స్పష్టమైంది.
సిరాజ్ ను టీమ్ ఇండియా స్థాయికి చేర్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). కెప్టెన్ గా కోహ్లి ఉన్న సమయంలో సిరాజ్ ను ఎంతో ప్రోత్సహించాడు. అయితే ఈ సీజన్ కు అతడిని బెంగళూరు రిటైన్ చేసుకోలేదు. కాగా.. గత నవంబరులో జరిగిన మెగా వేలంలో సిరాజ్ ను గుజరాత్ టైటాన్స్ రూ.11 కోట్లపైగా ధరతో కొనుక్కుంది.
మంగళవారం గుజరాత్ తమ తొలి మ్యాచ్ ను పంజాబ్ కింగ్స్ తో ఆడింది. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన సిరాజ్ ఏకంగా 23 పరుగులు ఇచ్చాడు. శశాంక్ సింగ్ వంటి కుర్రాడు సిరాజ్ ను బాదేశాడు. ఐపీఎల్ అనేది బ్యాట్స్ మెన్ రాజ్యం అయినా.. సిరాజ్ వంటి బౌలర్ శశాంక్ ను కట్టడి చేయాల్సింది. కానీ, 23 పరుగులు ఇచ్చేశాడు. చివరకు గుజరాత్ 11 పరుగుల తేడాతో ఓడింది. సిరాజ్ గనుక 10 పరుగులు తక్కువ ఇచ్చి ఉంటే ఫలితం గుజరాత్ కు అనుకూలంగా వచ్చి ఉండేదేమో? అందుకే సిరాజ్ భయ్.. బహుపరాక్.. అని చెప్పాల్సి వస్తోంది.