గెలిపించే బ్యాటర్.. ఓడే టైమ్ లో రావడమా.. ఇదే ధోనీ మాస్టర్ వ్యూహం
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే గొప్ప ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ధోనీ ఒక దశలో వన్ డౌన్ లోనూ దిగాడు.. కానీ, కొన్ని సీజన్లుగా ఐపీఎల్ లో క్రమంగా వెనక్కుతగ్గుతున్నాడు.;

2004కు ముందు ఒక లెక్క.. 2004 తర్వాత ఒక లెక్క.. టీమ్ ఇండియా విషయంలో ఈ డైలాగ్ కచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే 2004 తర్వాత టీమ్ ఇండియాలో ధోనీ భాగం అయ్యాడు కాబట్టి. చివరి బంతికి అవసరమైతే సిక్స్ కొట్టి గెలిపించే దమ్మున్న బ్యాట్స్ మన్ మనకు దొరుకుతాడా? అని ఎదురుచూస్తున్న రోజులవి.. ఆ లోటును తీర్చిన ధోనీ.. 15 ఏళ్లు దేశాన్ని ఎన్నో మ్యాచ్ లలో గెలిపించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే గొప్ప ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ధోనీ ఒక దశలో వన్ డౌన్ లోనూ దిగాడు.. కానీ, కొన్ని సీజన్లుగా ఐపీఎల్ లో క్రమంగా వెనక్కుతగ్గుతున్నాడు.
తాజాగా శుక్రవారం చెన్నైలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో మ్యాచ్ లో ధోనీ 9వ నంబరులో దిగాడు. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగలిగే ధోనీ.. కనీసం బ్యాటింగ్ రాని ఆటగాడు దిగే లోయరార్డర్ లో దిగడం ఏమిటా? అని చాలామందికి అనిపించింది.
ఇక మ్యాచ్ లో చెన్నై 50 పరుగులతో ఓడడం, ధోనీ 16 బంతుల్లో 30 పరుగులు చేయడంతో చాలామంది అతడిపై విమర్శలకు దిగుతున్నారు. వాస్తవానికి ధోనీ రాకముందే చెన్నై ఓటమి ఖాయమైంది.
ఇలా ఎందుకు?
ధోనీకి 44 ఏళ్లు. ఇప్పటికే 40 ఏళ్లున్న ఆటగాళ్లు రిటైర్ అయిపోయి కామెంట్రీ చెప్పుకొంటున్నారు. అలాంటిది ధోనీ మాత్రం ఇంకా వికెట్ల వెనుక పెట్టని గోడలా కీపింగ్ చేస్తున్నాడు. అయితే, బ్యాటింగ్ లో మాత్రం మునుపటి దూకుడు మాత్రం లేదు. శుక్రవారం మ్యాచ్ లో నాలుగు షాట్లు కొట్టినా అవి మ్యాచ్ ఫలితం తేలిపోయాక కొట్టినవే. అందుకే అతడు చివరగా వస్తున్నాడు.
మరోవైపు చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ లోతుగా ఉంది. ఆ జట్టులో 8వ నంబరు వరకు బ్యాటింగ్ చేయగల వారున్నారు. దీంతోనే వెటరన్ ధోనీ తగ్గుతున్నాడు. అంతేగాని.. చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్ మెంట్ తప్పిదమో..? ఇంకేదే కాదు.
కుర్రాళ్ల కోసమే...
ధోనీది క్రికెట్ బ్రెయిన్. అతడు చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ చేసింది కూడా ఇందుకే. ఒకటి లేదా రెండు మ్యాచ్ లలో ఓడినా కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనేది అతడి వ్యూహం. గతంలో ఇదే విషయాన్ని చెప్పాడు. అందుకే నిరుడు ఐపీఎల్ సీజన్ లోనూ ధోనీ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. గత సీజన్ లో ధోనీకి మోకాలి గాయం కూడా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ లో చివరగా రావడానికి కారణమూ ఇదే.
ఒకవేళ ధోనీ నాలుగో, ఐదో నంబరులో దిగినా భారీగా పరుగులు సాధిస్తాడని చెప్పలేం. అలాగైతే విమర్శలు తప్పవు. ఇప్పుడు కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ, ధోనీదే సరైన పద్ధతి. పైగా చెన్నై ఇప్పటికే ఐదు టెటిళ్ల విజేత. లీగ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్. అలాంటి జట్టుకు కొత్తగా ఏమైనా నిరూపించుకోవాల్సినది ఏమీ లేదు. భవిష్యత్ చాంపియన్ జట్టు నిర్మాణం తప్ప.