ఐపీఎల్ లో అచ్చ తెలుగు పేసర్.. ప్చ్.. బాగా మెరుగుపడాల్సిందే...
ఇలాంటి సమయంలో కాకినాడ జిల్లాకు చెందిన పెన్మత్స్ వెంకట సత్యనారాయణ రాజును ఈ ఏడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్ రూ.30 లక్షలకు తీసుకుంది.;

తెలుగు రాష్ట్రాల నుంచి బ్యాట్స్ మెన్ తప్ప పేస్ బౌలర్లు ఐపీఎల్ కు ఆడింది తక్కువే. మొహమ్మద్ సిరాజ్ ఉన్నప్పటికీ అతడు పక్కా హైదరాబాదీ. ఇక వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు, హనుమ విహారి, తిలక్ వర్మ వంటి బ్యాట్స్ మెన్, కొత్తగా నితీశ్ కుమార్ రెడ్డి వంటి పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ వచ్చినా అతడు నిఖార్సైన పేసర్ కాదు. ఇలాంటి సమయంలో కాకినాడ జిల్లాకు చెందిన పెన్మత్స్ వెంకట సత్యనారాయణ రాజును ఈ ఏడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్ రూ.30 లక్షలకు తీసుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ తో తొలి మ్యాచ్ లోనే సత్యనారాయణ రాజును ఆడించింది ముంబై. కానీ, ముంబై 155 పరుగులే చేసిన ఈ మ్యాచ్ లో రాజుకు ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసే చాన్స్ వచ్చింది. అతడు 13 పరుగులిచ్చాడు.
శనివారం గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో సత్యనారాయణ రాజు 3 ఓవర్లలోనే 40 పరుగులిచ్చేశాడు. ఒక్క వికెట్ తీసినా అది రషీద్ ఖాన్ ది. ట్రెంట్ బౌల్ట్ వంటి బౌలర్ తో కలిసి ఆడడం సత్యనారాయణ రాజుకు మేలు చేసేదే అయినా.. అతడు చాలా మెరుగుపడాల్సి ఉంది.
సత్యనారాయణ రాజు ప్రతిభను రెండు మ్యాచ్ లకే తక్కువ చేయడం కాదు. అతడికి 25 ఏళ్లే. పైగా 135 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు వేసే సామర్థ్యం అతడి సొంతం. అందుకే ముంబై వంటి జట్టు ఎంచుకుంది.
రోహిత్ మద్దతుతో..
సత్యనారాయణరాజుకు ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్యాల మద్దతు ఉంది. వీరిద్దరూ అతడికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఏదో ప్రత్యేకత ఉన్నందునే సత్యనారాయణ రాజును వారు ఎంచుకున్నారనడంలో సందేహం లేదు. ఇది అతడితో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. మున్ముందు జరిగే మ్యాచ్ లలో తెలుగు కుర్రాడు రాణించేందుకు తోడ్పడుతుంది.