ఈసారి జన్మంటూ ఉంటే తెల్లగా పుడతా.. కేరళ సీఎస్ పోస్ట్ వైరల్
ఈ నేపథ్యంలో కేరళ చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ తన మనోభావాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు.;

"నాకు మళ్లీ జన్మనిస్తే తెల్లగా పుడతా కదమ్మా" అంటూ చిన్నతనంలో తన తల్లిని అడిగిన ఆ మాటలు ఆమె మనసులో ఎప్పటికీ నిలిచిపోయాయి. ఉన్నత విద్యాభ్యాసం, కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రంలోనే అత్యున్నత పదవిని అధిరోహించినా, ఆమె శరీర రంగును గురించిన వ్యాఖ్యలు మాత్రం ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. చివరికి తన భర్త రంగుతో పోలుస్తూ కొందరు చేసిన కామెంట్లు ఆమెను తీవ్రంగా కలచివేశాయి. ఈ నేపథ్యంలో కేరళ చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ తన మనోభావాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు.

1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి అయిన శారదా మురళీధరన్ కొద్ది నెలల క్రితమే కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. విశేషం ఏమిటంటే.., ఆమె తన భర్త తర్వాత ఆ స్థానాన్ని అధిరోహించారు. అయితే, వారిద్దరినీ గమనించిన కొందరు వ్యక్తులు వారి రంగు గురించి చేసిన వ్యాఖ్యలు శారద దృష్టికి వచ్చాయి. ఈ విషయంపై ఆమె తొలుత ఒక పోస్ట్ చేసినప్పటికీ, వచ్చిన కామెంట్లకు కలత చెంది దానిని తొలగించారు. కానీ, ఈ అంశంపై చర్చ జరగాలని భావించిన ఆమె శ్రేయోభిలాషుల సూచన మేరకు మళ్లీ తన అంతరంగాన్ని ఫేస్‌బుక్ ద్వారా పంచుకున్నారు.
"ఒక సీనియర్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, అంతకుముందు ఆ స్థానంలో ఉన్న నా భర్తతో నన్ను పోల్చడం మొదలుపెట్టారు. అది ఏదో సిగ్గుపడాల్సిన విషయం అన్నట్లు, లేదా అది మంచిది కాదన్నట్లు నా రంగు గురించి మాట్లాడారు. కానీ నలుపును ఎందుకు అవమానించాలి? అది విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్యం. వర్షానికి ముందు కనిపించే వాగ్దానం, సాయంత్రానికి సూచిక. అసలు అది లేనిదెక్కడ?" అంటూ ఆమె తన పోస్ట్‌లో ప్రశ్నించారు.
తన చిన్ననాటి అనుభవాన్ని వివరిస్తూ, "ఈ రంగు చిన్నప్పుడే నన్ను పెద్ద మాటలు పలికేలా చేసింది. మళ్లీ నన్ను తన గర్భంలోకి తీసుకెళ్లి తెల్లగా, అందంగా తీసుకురాగలవా అని నాలుగు సంవత్సరాల వయసులో నేను నా తల్లిని అడిగేంతలా ఆ రంగు ప్రభావం నాపై 50 ఏళ్లపాటు కొనసాగింది. నలుపునకు విలువ లేదనే భావనలో తెలుపు పట్ల ఆకర్షితురాలినయ్యాను. దానివల్ల నేను తక్కువ వ్యక్తిగా భావించాను. కానీ నా పిల్లలు ఆ వర్ణం అద్భుతమని, అందమైనదని నేను గుర్తించేలా చేశారు" అని ఆమె తన బాధను, ఆ తరువాత కలిగిన అవగాహనను తెలియజేశారు.
శారదా మురళీధరన్ తన వ్యక్తిగత అనుభవాలను ఇలా బహిరంగంగా పంచుకోవడం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ స్పందిస్తూ, "ఆమె వెలిబుచ్చిన ప్రతి మాట హృదయాన్ని తాకింది. నా తల్లి కూడా నల్లటి ఛాయను కలిగి ఉండేది. ఇది తప్పకుండా చర్చించాల్సిన అంశం" అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
శారదా మురళీధరన్ గతంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ డైరెక్టర్ జనరల్‌గా, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్‌లో సీఓఓగా, కుడుంబశ్రీ మిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పలు కీలక హోదాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. కేరళ చరిత్రలో తొలిసారిగా భర్త నుంచి చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన ఆమె నియామకం అప్పట్లో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు వర్ణ వివక్షపై మరోసారి చర్చకు దారితీశాయి. రంగుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించాల్సిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు.