బాబు కొత్త నినాదం...కుదరదంటున్న వెంకయ్యనాయుడు

అయితే బాబు అన్న దానికి పూర్తి విరుద్ధమైన భావాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రకటించారు.;

Update: 2025-03-30 12:30 GMT
బాబు కొత్త నినాదం...కుదరదంటున్న వెంకయ్యనాయుడు

ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఒక కొత్త నినాదాన్ని తీసుకున్నారు. ఆయన ఏ వేదిక ఎక్కినా అదే ధాటీగా వినిపిస్తున్నారు. పైగా అలా చేయాల్సిందే అని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ బాబు కొత్త నినాదం ఏమిటి అంటే అధికంగా పిల్లలను కనడం.

ఒకనాడు పిల్లలు అన్నది దేశానికి భారమని భావించేవారు. కానీ ఇపుడు భారం ఎంతమాత్రం కాదని అదే దేశానికి అతి పెద్ద అడ్వాంటేజ్ అని బాబు చెబుతున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలలో జనాభా బాగా తగ్గిపోతోందని ఆయన గుర్తు చేస్తున్నారు.

ఈ సమయంలో భారత్ కనుక జనాభా పెంచుకుంటే కనుక కచ్చితంగా ఆ ఫలాలు ఫలితాలు భారత్ కి దక్కుతాయని ఆయన అంటున్నారు. ప్రతీ ఒక్కరూ కనీసంగా ఇద్దరు నుంచి ముగ్గురు పిల్లలను కనాలని బాబు పిలుపు ఇస్తున్నారు. తాజాగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలోనూ బాబు అదే మాట చెప్పారు.

దంపతులు ఎక్కువ మంది పిల్లలు కనాలని ఆ విధంగా వారిని అవగాహన కల్పించేలా పార్టీ క్యాడర్ కూడా చర్యలు తీసుకోవాలని బాబు కోరారు ఇక చెన్నైలో జరిగిన మద్రాస్ ఐఐటీ సదస్సులో కూడా యంగ్ స్టర్స్ ని ఉద్దేశించి బాబు మాట్లాడినపుడు ఇదే విధంగా సూచించారు.

ఎక్కువ మంది పిల్లలను కనండి అని ఆయన వారికి చెప్పారు ఉత్తరాది రాష్ట్రాలు ఈ విషయంలో ముందు ఉంటే దక్షిణాది వెనకబడిపోయిందని బాబు అన్నారు. సంతానోత్పత్తి దక్షిణాదిన తగ్గిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేయడాన్ని అంతా చూశారు.

అయితే బాబు అన్న దానికి పూర్తి విరుద్ధమైన భావాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రకటించారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్య కొంతమంది ఎక్కువ మంది పిల్లలను కనమని చెబుతున్నారని పరోక్షంగా బాబు తమిళనాడు సీఎం స్టాలిన్ నినాదాన్ని ప్రస్తావించారు. అయితే అది దేశానికి ఏమంత మంచిది కాదని ఆయన అన్నారు.

ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎక్కువ సీట్లు వస్తాయని రాజకీయంగా లాభమని చూసుకోవడం మంచిది కాదని ఆయన అన్నారు. ఎక్కువ మంది పిల్లలు ఉంటే జనాభా అధికం అయితే వారందరికీ వనరులు అందుబాటులోకి తేగలమా అని ఆలోచించాలని ఆయన అన్నారు. ఇపుడు ఉన్న వారికే వనరులు అందడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

అందువల్ల పాలకులు ఇపుడు ఉన్న వారికి అన్ని విధాలుగా వనరులు అందేలా చూసి వారు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. అంతే తప్ప ఎక్కువ మంది సంతానాన్ని పెంచుకుంటే అందరికీ ఏమీ చేయకపోతే ఇబ్బందులే వస్తాయని ఆయన తన అనుభవ సారాన్ని క్రోడీకరించి చెప్పారు.

ఎక్కువ మంది పిల్లలను కనమని కేవలం బాబు మాత్రమే అనడంలేదు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఇదే మాట అంటున్నారు. ఆయన అయితే ఏకంగా పదహారు మంది పిల్లలను దంపతులు కనాలని కూడా చెబుతున్నారు ఈ తరహా నినాదాలు విధానాలు దేశ హితానికి మేలు చేయవని మరో వైపు నిపుణులు కూడా చెబుతున్నారు. ఇపుడు ఉన్న నీరు భూమి కూడా జనాభా అధికం అవుతూండడంతో సరిపోవడం లేదు. 2050 నాటికి ప్రతీ ఒక్కరి అవసరాలకు సరిపడా నీరు అందదని మేధావులు అంటున్నారు. మరి ఉన్న వారికే ఏమీ లేకపోతే కొత్తగా పుట్టుకుని వచ్చే వారికి ఏమి ఇస్తారు అన్న ప్రశ్నలు ఉన్నాయి.

అయినా అధిక జనాభాతో అధిక పేదరికంతోనూ ఉత్తరాది రాష్ట్రాలు ఉన్నాయన్న సంగతిని విస్మరిస్తే ఎలా అని సూచనలు అందుతున్నాయి. ఇవన్నీ చూస్తూంటే ఎక్కువ మంది పిల్లలను కనాలన్న నినాదం బూమరాంగ్ అయ్యేలా ఉందనే అంటున్నారు. అసలా మాటకు వస్తే ఈనాటి యువతకు పెళ్ళి మీదనే ఆసక్తి లేకుండా పోతున్న వేళ ఇక సంసారం అధిక సంతానం అంటే వారి బుర్రలకు ఎక్కుతాయా అన్నది కూడా మరో వాదన ఉంది.

Tags:    

Similar News