తమిళ కమలంలో మళ్లీ రెండు ఆకులు.. పొత్తు తప్పదు మరి

ఓవైపు రెండోసారి సీఎం కావాలని డీఎంకే స్టాలిన్.. మరోవైపు అధినేత్రి జయలలిత లేకున్నా తమ పార్టీకి తిరుగులేదని అన్నాడీకేఎం;

Update: 2025-03-26 15:30 GMT
High battle in Tamil nadu elections

2026లో తమిళనాడు ఎదుర్కోనున్న ఎన్నికలు చాలా కీలకం. ఓవైపు రెండోసారి సీఎం కావాలని డీఎంకే స్టాలిన్.. మరోవైపు అధినేత్రి జయలలిత లేకున్నా తమ పార్టీకి తిరుగులేదని అన్నాడీకేఎం.. ఇంకోవైపు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ.. వీటి మధ్యనే తమ లక్ ను పరీక్షించుకునే జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్.. చివరగా కొన్ని ప్రాంతీయ పార్టీలు.. వామపక్షాలు.

అందుకే తమిళ రాజకీయం అంటే భలే ఆసక్తికరంగా ఉంటుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఇది మరింత రంజుగా సాగనుంది. స్టాలిన్ వయసు రీత్యా చూసినా.. టీవీకే విజయ్ స్టామినా చాటలన్నా.. అన్నాడీఎంకే మళ్లీ ఉనికి చూపాలన్నా.. ఈ ఎన్నికలే ప్రామాణికం. దీంతో హిందీ వ్యతిరేకత ప్రామాణికంగా భాషాపరమైన భావోద్వేగం ఆధారంగా స్టాలిన్ ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. విజయ్ మాత్రం తనకో చాన్స్ అంటున్నారు. మరి అన్నాడీఎంకే పరిస్థితి?

త్రిముఖ పోటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అన్నాడీఎంకే మళ్లీ బీజేపీకి దగ్గరవుతోంది. కమలం పార్టీకి ఆకు గుర్తు ఉన్న అన్నాడీఎంకే చేరువవడం అంటే కీలక పరిణామమే. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భే 40 నిమిషాలకు పైగా భేటీ అయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల వ్యూహ రచనే వీరి భేటీ ప్రధాన అంశం అయి ఉంటుందనడంలో సందేహం లేదు. దీంతో మళ్లీ పొత్తు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలో మళ్లీ క్రియాశీలం అవుతామని.. పళనిస్వామి ఆసక్తి చూపించారని సమాచారం. దీనికిముందు తమిళనాడు బీజేపీ నాయకత్వంతోనూ చర్చలు జరిపి సానుకూలత పొందారు.

వాస్తవానికి బీజేపీతో పొత్తు పళనిస్వామికి ఇష్టం లేదు. కానీ పార్టీ మనుగడ కష్టంగా మారడం.. విజయ్ రూపంలో ముప్పు పొంచి ఉండడం, బీజేపీ హైకమాండ్ ప్రభావం అన్నిటికి మించి స్టాలిన్ దక్షిణాదిలో బీజేపీ వ్యతిరేక కూటమి నేతగా ఎదగడంతో ఆయన పునరాలోచనలో పడ్డారు. కాస్త వెనక్కుతగ్గి కొన్ని డిమాండ్లను ప్రస్తావించి వాటిని పరిష్కరిస్తే అన్నాడీఎంకే-బీజేపీ పొత్తుకు ఓకే చెప్పారట. ఈ షరతుల్లో ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైకు ప్రాధాన్యం తగ్గించడం, జయ బంధువు టీటీవీ దినకరన్, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వంటి తిరుగుబాటుదారులతో బీజేపీ సంబంధాలు పెట్టుకోవద్దనడం వంటివి ఉన్నాయని తెలుస్తోంది.

అయినా.. కర్ణాటక కేడర్ మాజీ ఐపీఎల్ అన్నామలై ప్రాధాన్యతను తగ్గించడానికి బీజేపీ అంగీకరిస్తుందా?

Tags:    

Similar News