పాస్‌పోర్టు మర్చిపోయిన పైలట్.. విమానం వెనక్కి తిప్పాడు
లాస్ ఏంజెలెస్ నుండి షాంఘైకి బయలుదేరిన విమానం.. పైలట్ పాస్‌పోర్ట్ మర్చిపోవడంతో వెనక్కి తిరగాల్సి వచ్చింది.;

విమానంలో ప్రయాణించే వారికి పాస్‌పోర్ట్ ఎంత ముఖ్యమో.. విమానాన్ని నడిపే పైలట్‌కు కూడా అంతే ముఖ్యం. పాస్‌పోర్ట్ లేకపోతే ప్రయాణం మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. తాజాగా అమెరికాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. లాస్ ఏంజెలెస్ నుండి షాంఘైకి బయలుదేరిన విమానం.. పైలట్ పాస్‌పోర్ట్ మర్చిపోవడంతో వెనక్కి తిరగాల్సి వచ్చింది.
ఈ నెల 22న యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన అమెరికా విమానం 257 మంది ప్రయాణికులతో లాస్ ఏంజెలెస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం చైనాలోని షాంఘైకి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన రెండు గంటల తర్వాత పసిఫిక్ మహాసముద్రంపై ప్రయాణిస్తుండగా.. పైలట్ తన పాస్‌పోర్ట్‌ను ఇంట్లోనే మర్చిపోయినట్లు గుర్తించాడు. దీంతో ఎయిర్‌పోర్ట్ అధికారుల ఆదేశాల మేరకు విమానాన్ని వెంటనే వెనక్కి తిప్పారు. మధ్యాహ్నం బయలుదేరిన విమానం సాయంత్రం 5 గంటలకు మళ్లీ లాస్ ఏంజెలెస్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
ఈ అనూహ్య పరిణామంతో ప్రయాణికులు మొదట ఆందోళన చెందారు. అయితే అసలు విషయం తెలుసుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు వెంటనే ప్రయాణికుల కోసం మరో విమానాన్ని, వేరే పైలట్‌ను సిద్ధం చేశారు. ఆ విమానం రాత్రి 9 గంటలకు షాంఘైకి బయలుదేరింది. దాదాపు 12 గంటల ప్రయాణం తర్వాత ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకున్నారు.
పైలట్ పాస్‌పోర్ట్ మర్చిపోవడం వల్ల విమానాన్ని వెనక్కి తిప్పిన విషయం నిజమేనని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి ధృవీకరించారు. లాస్ ఏంజెలెస్‌లో విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులకు ఆహార కూపన్లు, నష్టపరిహారం అందించామని ఆయన తెలిపారు. ఒక్కో కూపన్ విలువ 15 డాలర్లు (సుమారు రూ. 1,283) అని వెల్లడించారు. ఈ ఘటన ప్రయాణికులకు కొంత అసౌకర్యాన్ని కలిగించినప్పటికీ, ఎయిర్‌లైన్స్ తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో అంతా సజావుగా ముగిసింది.