వివేకా హత్యపై బీజేపీ ఎమ్మెల్యే ఆది సంచలనం
కడపలో బలమైన రాజకీయ నేతల్లో ఒకరిగా పేరున్న ఆదినారాయణరెడ్డి సంచలవైసీపీన వ్యాఖ్యలు చేశారు.;

కడపలో బలమైన రాజకీయ నేతల్లో ఒకరిగా పేరున్న ఆదినారాయణరెడ్డి సంచలవైసీపీన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్ వివేకా హత్య గురించి వైపీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి అన్నీ తెలుసు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది’ అని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫ్యామిలీ మొత్తం ఈడీ.. సీబీఐ కేసుల్లో ఇరుక్కుందన్న ఆదినారాయణరెడ్డి.. ‘వారు చేసిన పాపాలన్నీ మాపై నెట్టే ప్రయత్నం చేశారు. జిల్లా పరువు తీశారు. అక్రమాస్తులు.. వివేకా హత్యకేసుల్లో నిందితులం కాదని వారు తేల్చుకోవాలి’ అంటూ సవాలు విసిరారు. వైసీపీ ప్రభుత్వంలో ఢిల్లీకి మించి ఏపీలోనే భారీగా లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపించారు.
ఎవరైనా మరణిస్తే జిల్లాకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి.. పరామర్శ పేరుతో రాజకీయాలు చేయటం.. రెండు, మూడు నెలల్లోనే ప్రభుత్వం పడిపోతుందని.. తాను తిరిగి వస్తానని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.వాస్తవానికి తదుపరి జమిలి ఎన్నికల్లో వైసీపీకి ఒక్క ఎంపీ.. ఎమ్మెల్యే సీటు కూడా రాకుండా చేస్తామన్నారు. లక్షలాది కోట్ల రూపాయిలని అప్పుల రూపంలో రాష్ట్రానికి తీసుకొచ్చి.. ఏపీని సర్వనాశనం చేశారంటూ మండిపడ్డారు. ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.