ఉగాది రోజున తినే ‘పచ్చడి’ వెనుక అర్థం ఇంతుంది తెలుసా?

తెలుగోళ్ల కొత్త సంవత్సరం ఉగాది. ఈ రోజున ఏం చేసినా చేయకున్నా.. ఉదయాన్నే లేచి.. తలంటు స్నానం చేసిన తర్వాత తొలుత రుచి చూసేది ఉగాది పచ్చడినే.;

Update: 2025-03-30 04:14 GMT
Ugadi: A Celebration of New Beginnings

తెలుగోళ్ల కొత్త సంవత్సరం ఉగాది. ఈ రోజున ఏం చేసినా చేయకున్నా.. ఉదయాన్నే లేచి.. తలంటు స్నానం చేసిన తర్వాత తొలుత రుచి చూసేది ఉగాది పచ్చడినే. దీన్ని తీసుకున్న తర్వాతే మిగిలిన దేన్నైనా తినేది. ఈ ఉగాది పచ్చడిని వేపపువ్వు.. ఉప్పు.. కారం.. బెల్లం.. పచ్చి మామిడికాయ ముక్కలు.. చింతపండుతో కలిపి చేయటం తెలిసిందే. ఈ ప్రసాదం ఆరోగ్యానికి మేలు చేయటమే కాదు.. ఈ పచ్చడిలో జీవితసారం బోలెడంత.

మనిషి జీవితంలో ఎదురయ్యే సుఖదు:ఖాల మేలుక కలయికను చెప్పటమే కాదు.. ఉగాదితో మొదలయ్యే వేసవి (ఇప్పుడంటే ఉగాదికి ముందే ఎండలు మండుతున్నాయి కానీ ముప్ఫై.. నలభై ఏళ్ల క్రితం కూడా ఉగాది రోజు నుంచే ఎండలు మొదలయ్యేవి) కి శరీరం తట్టుకునేలా చేస్తుందని చెబుతారు. ఉగాది పచ్చడిలో వాడే ప్రతి పదార్థానికి కొన్ని ప్రత్యేక గుణాలు ఉండటమే దీనికి నిదర్శనం. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఉగాది పచ్చడి కాస్త తిన్నా అమృతంలా ఉండటం విశేషం. వేప పువ్వుతో చేసే ఈ పచ్చడి చిరు చేదును.. అదే సమయంలో కారాన్ని..తియ్యదనాన్ని.. పుల్లటి భావనతో మొత్తం ఆరు వేర్వేరు రుచులు ఒక్కసారి కలిగే అనుభవం మరేం తిన్నా కలగని అనుభూతి సొంతమవుతుందని మాత్రం చెప్పక తప్పదు.

ఉగాది పచ్చడిలోని విశిష్ఠతల్ని ఆయుర్వేద శాస్త్రం ప్రత్యేకంగా చెబుతుంది. ఇందులో వినియోగించే ప్రతి వస్తువు ఆరోగ్యానికి మేలు చేయటం విశేషం. అదే సమయంలో ఉగాది పచ్చడి తినే వేళలో.. ఒక నమ్మకాన్ని ప్రత్యేకంగా చెబుతారు. ఈ పచ్చడిని నోట్లో వేసుకున్నంతనే మెదడుకు అనిపించే మొదటి రుచికి తగ్గట్లే.. ఏడాది మొత్తం ఉంటుందన్న నమ్మకం ఎక్కువ. ఇందులో లాజిక్ ఏమిటంటే.. ప్రత్యేకంగా ఇది అని చెప్పలేం కానీ.. ఈ నమ్మకం ఎప్పటి నుంచో వస్తుందని మాత్రం చెప్పక తప్పదు.

తీపి

బెల్లంలోని తీపి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. శరీరంలో కణాలు నశించకుండా కొత్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. వాత, పిత్త దోషాలను హరించి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అలాగే జీవితంలో అనుభవమయ్యే సంతోషాలకూ, ఆనందానికి, సంతృప్తికీ తీపి సంకేతంగా దీన్ని చెప్పొచ్చు.

పులుపు

చింతపండు పులుపులోని ఆమ్లతత్వం జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేసి ఆరోగ్యంగా ఉంచేందుకు సాయం చేస్తుంది. ఈ రుచి ఎక్కువ, తక్కువ కాకుండా మితంగా తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని మనకు చెబుతుంది. జీవితంలో పరిస్థితులకు అనుగుణంగా నేర్పుగా ముందుకు సాగాలన్న సందేశాన్ని ఇస్తుందని చెప్పాలి.

ఉప్పు

ఉప్పు లేకుండా ఏమీ తినలేం. అదే టైంలో ఉప్పును ఎక్కువ తిన్నా కష్టమే. అలా అని అసలు తినకుండా సాధ్యం కాదు. ఆకలి, జీర్ణశక్తిని పెంపొందించే లవణాన్ని ప్రతిఒక్కరూ తప్పక తీసుకోవాలి. ఇది ఎక్కువైనా, తక్కువైనా నష్టమే. ఉప్పు లేకుంటే జీవితం కూడా చప్ప చప్పగా రుచి లేకుండా ఉంటుంది. జీవితంలో ఏ భావోద్వేగం కలిగినా తట్టుకుని నిలబడాలన్న విషయాన్ని ఈ రుచి చెబుతుంది.

వగరు

మామిడిలో ఇచ్చే వగరు ఇచ్చే సందేశం ప్రత్యేకం. రుచి నచ్చినా నచ్చకపోయినా దీన్ని తప్పక స్వీకరించి ముందుకు సాగటం వెనుక అర్థం ఎక్కువే. కొన్నింటిని నచ్చకున్నా.. వాటితో సాగాలన్న విషయాన్ని చెబుతుంది.పచ్చి మామిడికాయ చెమట అధికంగా పట్టకుండా, శరీరం దృఢంగా ఉండేలా చూస్తుంది. గాయాలు త్వరగా మానడానికి వగరు సాయం చేస్తుంది.

కారం

ఉగాది పచ్చడిలో కారం కోసం మిరియాలు, లేదా పచ్చిమిరపకాయలు.. మిర్చి పౌడర్ (కారం పొడి0 వాడతారు. ఇది శరీరంలో రోగనిరోధకశక్తిని, వేడిని పెంచి ఉత్తేజాన్ని నింపుతుంది. స్కిన్ ఇన్‌ఫెక్షన్స్ రావు. చెమట ఎక్కువగా పట్టి బరువు తగ్గడానికి సాయపడుతుంది. ఎక్కువగా తింటే కోపం, కడుపులో మంట పెరిగి శరీరం బలహీనమవుతుంది. కష్టనష్టాలకు ఉదాహరణగా కారాన్ని చెబుతారు.

చేదు

సాధారణంగా పండుగ రోజున తీపి.. కారాలకే ప్రాధాన్యత ఇస్తారు. మరే పండుగ రోజున లేని రీతిలో చేదును ప్రత్యేకంగా తీసుకునే ఒకే ఒక్క పండుగగా ఉగాదిని చెప్పొచ్చు. ఉగాది పచ్చడిలో చేదు ఇస్పెషల్ అని చెప్పాలి.మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఇబ్బందులు, అసంతృప్తి వంటి అనేక చేదు అనుభూతులను సూచిస్తుంది. వేప పువ్వు రోగ నిరోధక శక్తిని పెంచుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇలా ఉగాది పచ్చడిలోని ప్రతి రుచి కూడా జీవితానికి సంబంధించిన ఏదోఒక విషయాన్నిచెబుతుందని చెప్పాలి.

Tags:    

Similar News