బెట్టింగ్ పై సిట్: సీఎం రేవంత్
తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్‌ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.;

రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్నవారిని.. ప్రచారం చేస్తున్న వారిని కూడా ఊరుకునేది లేదన్నారు. యువత జీవితాలు.. దుర్భరంగా మారుతున్నాయని చెప్పారు. అనేక కుటుంబాలు అప్పుల పాలై నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్‌ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.
ప్రస్తుతం బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్న వారిపై కేసులు పెడుతున్నట్టు సీఎం చెప్పారు. భవిష్యత్తు లో దీనిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్ విచారణను ముమ్మరం చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని( సిట్) నియమిస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ పట్ల కఠినంగా ఉంటామన్నారు. గత ప్రభుత్వంలోనే ఈ జాడ్యం రాజుకుందని.. గ్రామాలకు సైతం బెట్టింగ్ యాప్‌లు చొరబడ్డాయని ఆరోపించారు.
దీంతో అప్పులు చేసి మరీ యువత బెట్టింగులు కట్టి మోస పోతున్నారని సీఎం చెప్పారు. అప్పులు తీర్చే మార్గం లేక జీవితాలు నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తూ.. ప్రకటనలు చేసినా.. నిర్వహణలో భాగస్వామ్యం ఉన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వం బెట్టింగ్ యాప్‌లను నిషేధిస్తూ.. చేసిన చట్టంలోనూ కొన్ని లోపాలు ఉన్నాయని.. వాటిని కూడా సరిచేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. బెట్టింగ్ యాప్‌ల కారణంగానే గతంలో న్యాయవాదులు, వెటర్నరీ డాక్టర్ హత్యలు జరిగాయని రేవంత్ సభలో వివరించారు.