తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు విలువ ఎంటో చెప్పిన కామ్రేడ్

ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావన..;

Update: 2025-03-26 04:17 GMT
తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు విలువ ఎంటో చెప్పిన కామ్రేడ్

రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అందునా రాజకీయాల్లో శాశ్విత శత్రుత్వం.. శాశ్విత మిత్రత్వం అన్నది ఉండదు. తెలంగాణలో చంద్రబాబు ప్రస్తావన అయితే నెగిటివ్ గా ఉండాలే కానీ పాజిటివ్ గా మాట్లాడే ధైర్యం చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఇప్పుడు మారుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావన.. ఆయన విజన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు ఒక సభ్యుడి నోటి నుంచి రావటం విశేషం. అది కూడా వామపక్ష నేత నుంచి రావటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ఏ ఇజం లేదు ఇక టూరిజమే ప్రధానం అనేవారని.. ఏ ఇజం లేదంటే అప్పుడు తమకు కోపం వచ్చేదని.. కానీ ఇప్పుడు ఆయన మాటలు తమకు అర్థమవుతున్నాయన్నారు. ‘‘నిజంగా ఖర్చు లేని ఇజం ఏదైనా ఉందంటే అది టూరిజమే’ అంటూ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. బడ్జెట్ పద్దులపై తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన తెలంగాణలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని.. వాటి డెవలప్ మెంట్ మీద శ్రద్ధ పెట్టాలన్నారు.

నేలకొండపల్లి.. పాపికొండలు.. నాగార్జునసాగర్ వంటి వాటిని డెవలప్ చేసి రాష్ట్రాన్ని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దాలన్న ఆయన.. ఉమ్మడి రాష్ట్రంలోభద్రాద్రి ఆలయానికి చాలా అన్యాయం జరిగిందన్నారు. ఈ పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేస్తే తెలంగాణలో రెండో అతి పెద్ద పర్యాటక ప్రాంతమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు మిత్రపక్షమని.. అలా అని ప్రభుత్వం తప్పు చేస్తే దాన్ని కూడా సభలో చెబుతానని వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు పేరును ప్రస్తావించేందుకు సైతం ఇష్టపడని తీరుకు భిన్నంగా తాజా పరిస్థితులు ఉన్నాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News