పన్నుపోటు వారికి మినహాయింపు.. మోడీపై ట్రంప్ ఎఫెక్టు బాగానే!
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ట్రంప్ పాలన ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.;

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ట్రంప్ పాలన ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా ప్రయోజనాలు.. తమ దేశానికి చెందిన కంపెనీలకు మేలు కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇతర దేశాల మీదా.. అక్కడి ప్రభుత్వాల మీదా ఒత్తిడి తెచ్చేందుకు సైతం వెనుకాడటం లేదు. ట్రంప్ ఆత్మీయ మిత్రుడిగా పేరున్న మోడీని సైతం వదలట్లేదు ట్రంప్. తమ ప్రయోజనాల విషయంలో తాను రాజీ పడనన్న విషయాన్ని మాటల్లోనే కాదు చేతల్లోనే చూపిస్తున్నారు.
మిగిలిన అంశాల్లో ఎలా ఉన్నా.. ఆర్థిక అంశాల విషయంలో మోడీ ఎంత కరకుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పన్ను రాయితీలు ఇచ్చేందుకు ఆయన ససేమిరా అంటారు. దేశ ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించే విషయంలో ఆయన ఎంత కఠినంగా ఉంటారో తెలియంది కాదు. అలాంటి మోడీ చేత.. తమ కంపెనీల మీద విధించిన పన్నులను రద్దు చేయించిన ఘనత ట్రంప్ కే దక్కుతుంది.
గూగుల్.. ఫేస్ బుక్.. ఇన్ స్టాగ్రామ్ లాంటి ఆన్ లైన్ డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వచ్చే యాడ్స్ మీద ఈక్వలైజేషన్ లెవీ పేరుతో విధించే ఆరు శాతం పన్నును మోడీ సర్కారు రద్దు చేయటం దీనికి నిదర్శనంగా చెప్పాలి. గూగుల్ ట్యాక్స్ గా ప్రాచుర్యం పొందిన ఈ పన్నును ఈ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఆర్థిక బిల్లు.. 2025కు చేసిన సవరణకు పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది.
తాజా నిర్ణయం ట్రంప్ సర్కారు అనుసరిస్తున్న విధానాల కారణంగానే చెబుతున్నారు. తమ మీద భారత్ అత్యధిక పన్నుల్ని మోపుతుందని.. తమ కంపెనీలపై విధిస్తున్న పన్ను గురించి తరచూ ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. తమ వైఖరిలో మార్పును ట్రంప్ నకు తెలియజేసేందుకు వీలుగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తాజా పరిణామంతో భారత్ - అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు సానుకూలంగా ముగుస్తాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
నిజానికి ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మీద విధించిన పన్ను 2016 నుంచి అమల్లో ఉంది. గతంలోనూ అమెరికా ఈ పన్ను మీద ఆందోళన వ్యక్తం చేసినా.. పట్టించుకున్నది లేదు. అయితే.. ట్రంప్ సర్కారు తాజాగా పెట్టిన మెలిక.. పన్ను రద్దుకు కారణమైందంటన్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మీద విధించే ఆరు శాతం పన్నును రద్దు చేయని పక్షంలో భారత్ నుంచి దిగుమతి అయ్యే రోయ్యిలు.. బాస్మతి బియ్యం మీద అదే స్థాయిలో పన్ను విధిస్తామన్న హెచ్చరికే తాజా పన్ను రద్దు నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు.
పన్ను రద్దు నిర్ణయంతో ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ మీద పన్ను ఖర్చు తగ్గటంతో ఆయా సంస్థల లాభాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అమెరికాతో తలెత్తిన వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాజా నిర్ణయం అవకాశం కల్పిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. మోడీ సర్కారు మీద ట్రంప్ ఎఫెక్టు ఎంతన్నది తాజా పరిణామం స్పష్టం చేస్తుందని చెబుతున్నారు.