ఐపీఎల్ లో తొలి గిరిజన క్రికెటర్.. అదీ గిరిజన రాష్ట్రం నుంచే

ఇప్పుడు జార్ఖండ్ కే చెందిన ఓ కుర్రాడు.. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ధోనీ తరహాలో తానూ ఉన్నానంటూ దూసుకొస్తున్నాడు.;

Update: 2025-03-25 14:30 GMT

భారత దేశంలో గిరిజన రాష్ట్రం అంటే అందరూ మొదటగా చెప్పే పేరు జార్ఖండ్.. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినవారు ఎక్కువ శాతం గిరిజనులే. మైనింగ్, అడవులకు పేరుగాంచిన జార్ఖండ్ ఒకప్పటి బిహార్ లో భాగం. 2000 సంవత్సరంలో ఈ రాష్ట్రం ఏర్పడింది.

కేవలం మైనింగ్, పారిశ్రామికంగా పేరున్న జార్ఖండ్ కు 2004 తర్వాత గొప్ప పేరు తెచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ. అసలు జార్ఖండ్ నుంచి ఒక క్రికెటర్.. అందులోనూ ఓ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప అనుకుంటే ధోనీ ఏకంగా కెప్టెన్ అయ్యాడు. భారత క్రికెట్ చరిత్రలోనే దిగ్గజంగా ఎదిగాడు. ఇదే రాష్ట్రం నుంచి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా వికెట్ కీపర్ బ్యాట్స్ మెనే. వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన అతికొద్ది క్రికెటర్లలో ఒకడు. ఇప్పుడు సన్ రైజర్స్ కు ఆడుతూ తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టాడు. కాగా, సౌరభ్ తివారీ వంటి మరో క్రికెటర్ కూడా జార్ఖండ్ నుంచి టీమ్ ఇండియా స్థాయికి వచ్చినా రాణించలేదు.

ఇప్పుడు జార్ఖండ్ కే చెందిన ఓ కుర్రాడు.. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ధోనీ తరహాలో తానూ ఉన్నానంటూ దూసుకొస్తున్నాడు. అతడి పేరు రాబిన్ మింజ్. 22 ఏళ్ల రాబిన్ మింజ్ పేరు వినేందుకు విదేశీయుడి పేరులా వినిపించినా అతడు అచ్చమైన భారతీయుడు.

ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై తరఫున బరిలో దిగిన రాబిన్ మింజ్ ఐపీఎల్ లో ఆడిన తొలి గిరిజనుడిగా రికార్డును అందుకున్నాడు. జార్ఖండ్ లోని గుమ్లాలో పుట్టిన మింజ్.. 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. 75 పరుగులు చేశాడు. 8 టి20ల్లో 70 పరుగులు సాధించాడు. హార్డ్ హిట్టర్ గా పేరొందిన ఇతడిని ముంబై రూ.65 లక్షలకు తీసుకుంది.

కొసమెరుపు: ఐపీఎల్ లో తన తొలి మ్యాచ్ ను రాబిన్ మింజ్.. తమ రాష్ట్రానికే చెందిన దిగ్గజం ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ పై ఆడడం.

Tags:    

Similar News