లండన్ నల్ల ట్యాక్సీలా ఆర్చర్ మీటర్.. హర్భజన్ జాతి వివక్ష వ్యాఖ్యలు

ఆర్చర్ బౌలింగ్ తీరుపై తీవ్ర అసహనానికి గురైన హర్భజన్ సింగ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.;

Update: 2025-03-24 08:58 GMT

జాతి వివక్ష ఎక్కడైనా సహించకూడనిది.. మరీ ముఖ్యంగా క్రీడల్లో. జాతి వివక్ష చూపినందుకే దక్షిణాఫ్రికా వంటి అద్భుతమైన జట్టు 21 ఏళ్ల క్రికెట్ లో నిషేధం ఎదుర్కొంది.. అయితే, స్వయంగా జాతి వివక్ష బాధితుడైన టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన తాజా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

కరీబియన్ దీవుల్లో పుట్టినా.. ఇంగ్లండ్ లో స్థిరపడి ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్. ప్రతిభావంతుడైన పేసర్ కావడంతో ఆర్చర్ కోసం 2019 వన్డే ప్రపంచ కప్ నకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిబంధనలను సవరించి జట్టులో చోటు కల్పించింది.

ఎంతటి మేటి బౌలరో అంతటి గాయాల బాధితుడు ఆర్చర్. 2019 నుంచి ఆరేళ్లలో అతడు మూడేళ్లు కూడా జాతీయ జట్టుకు ఆడలేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో ఐపీఎలో అతడిని తీసుకున్నా గాయాలతో వైదొలగాడు.

ఇప్పుడు మాత్రం ఆర్చర్ పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాడు. మొన్నటి భారత పర్యటన, ఆపై చాంపియన్స్ ట్రోఫీ, తాజాగా ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్నాడు. అయితే, పెద్దగా ఫామ్ లో లేడు. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి 76 పరుగులు ఇచ్చాడు. గత ఏడాది గుజరాత్‌ టైటాన్స్ కు చెందిన మోహిత్‌ శర్మ (73) పేరిట ఉన్న రికార్డును ఆర్చర్ దాటేశాడు. ఐపీఎల్‌ మ్యాచ్‌ లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌ గా కోరుకోని రికార్డును మూటగట్టుకున్నాడు. సాధారణ బౌలర్ అయిన మోహిత్ శర్మ, మేటి పేసర్ అయిన ఆర్చర్ సమానం అయ్యారు ఇప్పుడు.

ఆర్చర్ బౌలింగ్ తీరుపై తీవ్ర అసహనానికి గురైన హర్భజన్ సింగ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కామెంటేటర్‌ గా ఉన్న భజ్జీ.. ఆర్చర్‌ ను లండన్ లో తిరిగే నల్ల రంగు ట్యాక్సీ (కాలీ ట్యాక్సీ)లతో పోల్చాడు. 18వ ఓవర్లో ఆర్చర్‌ బౌలింగ్‌ లో హైదరాబాద్‌ బ్యాటర్ క్లాసెన్‌ వరుసగా బౌండరీలు బాదాడు. దీంతో భజ్జీ మాట్లాడుతూ.. లండన్‌లో నల్ల రంగు ట్యాక్సీల మీటర్ల మాదిరిగానే.. ఆర్చర్‌ మీటర్‌ ఈ రోజు పెరుగుతూనే ఉంది అని అభివర్ణించాడు. ఇది వివాదాస్పదంగా మారడంతో పాటు భజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కామెంట్రీ ప్యానెల్ నుంచి అతడిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. హర్భజన్‌ క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తన వ్యాఖ్యలపై భజ్జీ స్పందించలేదు.

2007-08లో ఆస్ట్రేలియా టూర్ లో భజ్జీ, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ మధ్య వివాదం రేగిన సంగతి తెలిసిందే. సైమండ్స్ ను కోతి అన్నాడని.. భజ్జీపై విమర్శలు వచ్చాయి. ఇది చివరకు జాతి వివక్ష వ్యాఖ్యల వరకు వెళ్లింది. ఆ టూర్ అత్యంత ఉద్రిక్తంగా సాగింది. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే సారథ్యంలోని టీమ్ ఇండియా ఆ టూర్ లో గట్టిగా నిలబడడంతో వివాదం సద్దుమణిగింది.

Tags:    

Similar News