ఇది గుర్తుపెట్టుకోండి.. ఆశుతోష్ తోపు.. టీమ్ ఇండియాకి ఆడతాడు

సోమవారం మ్యాచ్ లో దాదాపు గెలిచేశాం అనుకున్న లక్నోను ఆశుతోష్ తీవ్రంగా నిరాశపరిచాడు.;

Update: 2025-03-25 09:30 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో గత ఏడాది పంజాబ్ కింగ్స్ దారుణ ప్రదర్శన నమోదు చేసింది.. వాస్తవానికి ఆ జట్టుపై ఎప్పుడూ ఆశలు ఉండవు.. నిరుడూ ఇంతే.. కానీ, ఇద్దరు కుర్రాళ్లు మాత్రం ఏమాత్రం ఆశలు లేని స్థితి నుంచి పోరాడారు. వారే.. ఆశుతోష్ శర్మ, శశాంక్ సింగ్. అద్భుతమైన పోరాటంతో వీరిద్దరూ గత ఏడాది లీగ్ లో పంజాబ్ పరువు నిలిపారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పంజాబ్ ప్లేఆఫ్స్ కు వెళ్లలేదు.

ఈ ఏడాది కూడా వీరిద్దరూ ఐపీఎల్ లో ఉన్నారు. కానీ, ఆశుతోష్ మాత్రం పంజాబ్ కింగ్స్ కు ఆడడం లేదు. మెగా వేలంలోకి వెళ్లిన ఇతడిని రూ.3.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. 26 ఏళ్ల ఆశుతోష్ తన ధరకు మించిన న్యాయం చేస్తూ ఢిల్లీని గెలిపించాడు. కేవలం 31 బంతుల్లోనే అజేయంగా 66 పరుగులు చేశాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గా నిలిచాడు.

పంజాబ్ తరఫున నిరుడు మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఆశుతోష్ ఐపీఎల్ లో నిలకడ కొనసాగిస్తాడని ఎవరూ భావించి ఉండకపోవచ్చు. కానీ, ఆ ఫామ్ ను కొనసాగిస్తూ అదరగొట్టాడు.

సోమవారం మ్యాచ్ లో దాదాపు గెలిచేశాం అనుకున్న లక్నోను ఆశుతోష్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఇప్పుడు అతడి వీరోచిత ఇన్నింగ్స్ సోషల్ మీడియా స్టేటస్ గా మారిపోయింది.

కెప్టెన్ పంత్, డివిలియర్స్, మెక్ గర్క్ సహా 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీని గెలిపించిన ఆశుతోష్ ఒక దశలో 20 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సమయంలో లక్నో గెలుపుపై ఎవరికీ ఆశల్లేవ్. కానీ, తర్వాత ఆడిన 11 బంతుల్లోనే 46 పరుగులు పిండుకున్నాడు.

ఆశుతోష్ ఇదే ఫామ్‌ కొనసాగిస్తే భవిష్యత్తులో టీమ్ ఇండియాకు ఆడడం ఖాయం. కాగా, మ్యాచ్‌ అనంతరం అశుతోష్‌కు ఓ స్పెషల్ వీడియో కాల్‌ వచ్చింది. తన మెంటార్‌ శిఖర్‌ ధావన్‌ ఫోన్‌ చేసి అభినందించాడు.

‘చాలా ఆనందంగా ఉంది. లవ్‌ యూ పాజీ’ అని ప్రేమను వ్యక్తం చేశాడు. ఈ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్‌ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. ‘అశు-గబ్బర్‌.. ఇది ఢిల్లీ లవ్ స్టోరీ’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, తన మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్ ను తన మెంటార్‌ ధావన్‌ కు అంకితమిస్తున్నట్లు ఆశుతోష్ చెప్పాడు. గత సీజన్‌ లో వీరిద్దరూ పంజాబ్‌ కింగ్స్‌కు ఆడారు.

Tags:    

Similar News