మన సిరాజ్ కాకుండా.. ఐపీఎల్ లో మరో ఆటో డ్రైవర్ కొడుకు

ఇప్పుడు రూ.3 కోట్ల ఇంటిలో ఉంటూ.. తనను ఇంతవాడిని చేసిన ఐదు సిక్సులు కొట్టిన బ్యాట్ కు స్పెషల్ ఫ్రేమ్ కట్టించి పెట్టాడు.;

Update: 2025-03-24 10:30 GMT

రింకూ సింగ్.. ఉత్తర ప్రదేశ్ లో ఆటోలో గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే వ్యక్తి కుమారుడు.. కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడుతూ ఒకే ఓవర్ లో ఐదు సిక్సులు కొట్టి టీమ్ ఇండియా తలుపులు తట్టాడు. ఇప్పుడు రూ.3 కోట్ల ఇంటిలో ఉంటూ.. తనను ఇంతవాడిని చేసిన ఐదు సిక్సులు కొట్టిన బ్యాట్ కు స్పెషల్ ఫ్రేమ్ కట్టించి పెట్టాడు.

మొహమ్మద్ సిరాజ్.. హైదరాబాద్ కు చెందిన ఆటో డ్రైవర్ కుమారుడు.. హైదరాబాద్ గల్లీల్లో ఆడుతున్న అతడిలోని ప్రతిభను గుర్తించి సానబట్టగా టీమ్ ఇండియాకు ప్రధాన పేస్ బౌలర్ అయ్యాడు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన తొలి హైదరాబాదీగా రికార్డులకు ఎక్కాడు.

వీరిద్దరి బాటలోనే మరో ఆటో డ్రైవర్ కుమారుడు టీమ్ ఇండియా దిశగా అడుగులేస్తున్నాడు. అతడే కేరళ చెందిన కుర్రాడు. కాగా, ప్రతిభావంతులను జాతీయ జట్టుకు అందించే ఐపీఎల్ ఫ్రాంచైజీగా ముద్రపడిన ముంబై ఇండియన్స్ తరఫున తొలి మ్యాచ్ లోనే ప్రతిభ చాటాడు.

హిట్టర్ లను ఔట్ చేసి..

విఘ్నేష్ పుత్తూరు.. చెప్పుకోబోతున్న స్టోరీ అంతా అతడిదే. కేరళకు చెందిన 24 ఏళ్ల కుర్రాడు విఘ్నేష్ మెగా వేలంలో ముంబై రూ.30 లక్షలకు తీసుకుంది. ఆదివారం తన ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె, దీపక్ హుడాలను ఔట్ చేసి ఔరా అనిపించాడు. ఎందుకంటే వీరు ముగ్గురూ టి20ల్లో సూపర్ రికార్డులు ఉన్నవారు. అలాంటివారిని పుత్తూరు అలవోకగా ఇంటికి పంపించాడు.

ఇంతకూ విఘ్నేష్ కు ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడిన అనుభవం లేదు తెలుసా? గత ఏడాది కేరళ క్రికెట్ లీగ్‌ లో అలప్పుజ రిపుల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. మణికట్టు స్పిన్నర్ అయిన పుత్తూరు.. అలా ముంబై ఇండియన్స్ సెలక్టర్లకు కంట్లో పడ్డాడు. చెన్నై ఇతడిని ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపింది. 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఓ విధంగా చెప్పాలంటే కాస్త పరుగులు ఎక్కువగా ఇచ్చినా మ్యాచ్ ను చివరి వరకు తీసుకొచ్చాడు.

కాగా విఘ్నేష్ ది దిగువ మధ్య తరగతి కుటుంబం. తండ్రి సునీల్ కుమార్ ఆటో డ్రైవర్‌. ఆదివారం మ్యాచ్ ఆనంతరం ప్రత్యర్థి జట్టు దిగ్గజం ధోని.. యువ స్పిన్నర్ విఘ్నేశ్ భుజం తట్టడం విశేషం. రాయుడు, బుమ్రా, పాండ్యా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటివారిని టీమ్ ఇండియా అందించిన ముంబై ఐపీఎల్ లో డ్రీం టీం. ఆ టీం తరపున ఎలాంటి అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చి తొలి మ్యాచ్ లోనే ఉత్తమ గణాంకాలు నమోదు చేసిన విఘ్నేశ్ పుత్తూరు ఇప్పుడు హాట్ టాపిక్.

Tags:    

Similar News