ఒకే ఐపీఎల్ జట్టులో ఇద్దరు తెలుగోళ్లు.. చాన్సిచ్చిన ముంబై ఇండియన్స్

ఇప్పుడు ఐపీఎల్ లో మరో తెలుగు కుర్రాడికి కూడా ముంబై చాన్సిచ్చింది. అతడు అచ్చ తెలుగోడు కావడం విశేషం.;

Update: 2025-03-24 03:43 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తెలుగు వారు అంబటి రాయుడు.. తిలక్ వర్మలకు అంతర్జాతీయ కెరీర్ పునాది వేసిన ముంబై ఇండియన్స్ మరో తెలుగు క్రికెటర్ కు చాన్సిచ్చింది.

రాయుడు, తిలక్ మాత్రమే కాదు.. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి మెరికలను టీమ్ ఇండియాకు అందించిన ఫ్యాక్టరీ ముంబై ఇండియన్స్. ప్రతిభావంతులను వెదికి పట్టుకోవడమే కాదు.. వారికి అండగా నిలవడంలోనూ ముంబైది గొప్ప మనసు. రాయుడికి ఇలానే లైఫ్ ఇచ్చింది. ఇప్పుడు ఐపీఎల్ లో మరో తెలుగు కుర్రాడికి కూడా ముంబై చాన్సిచ్చింది. అతడు అచ్చ తెలుగోడు కావడం విశేషం.

స్పిన్నర్లు, బ్యాట్స్ మెన్ గా టీమ్ ఇండియాకు తెలుగువారు చాలా మంది ఆడారు. కానీ, పేసర్ లు మాత్రం లేరనే చెప్పాలి. అయితే, ఒక్కడు మాత్రం కాస్త ఆశ కల్పిస్తున్నాడు. అతడే పెన్మత్స సత్యనారాయణ రాజు.

టీమ్ ఇండియాకు ఎంపికవుతాడని చెప్పలేం కానీ.. సత్యనారాయణ రాజు మాత్రం ప్రతిభావంతుడైన కుడిచేతివాటం మీడియం పేసరే. 25 ఏళ్ల ఇతడు ఏపీలోని కాకినాడకు చెందినవాడు. నవంబరులో జరిగిన మెగా వేలంలో రూ.30 లక్షలకు ముంబై ఇండియన్స్ సత్యనారాయణ రాజును తీసుకుంది.

ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ విజేత ముంబై జట్టుకు ఆడడం అంటే మామూలు మాటలు కాదు. 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 17 వికెట్లు పడగొట్టిన సత్యనారాయణ రాజు.. లిస్ట్ ఏలో 7 మ్యాచ్ లలో 9, 7 టి20లలో 9 వికెట్లు తీశాడు.

ఆదివారం చెన్నైతో జరిగిన తమ తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ సత్యనారాయణ రాజుకు తుది జట్టులో చోటిచ్చింది. ఇదే మ్యాచ్ లో ముంబై కీలక బ్యాటర్ తిలక్ వర్మ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అంటే ఒకే ఐపీఎల్ జట్టులో ఇద్దరు అచ్చ తెలుగోళ్లు అన్నమాట. బహుశా ఇది చాలా అరుదు అనే చెప్పొచ్చు.

పక్కా హైదరాబాదీ అయిన సిరాజ్ (రూ.12.25 కోట్లు) గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్నాడు. నితీశ్ రెడ్డి రూ.8 కోట్లకు సన్ రైజర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వీరుకాక గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ రూ.30 లక్షలు-చెన్నై, శ్రీకాకుళం చిన్నోడు త్రిపురాన విజయ్ రూ.30 లక్షలు-ఢిల్లీ క్యాపిటల్స్, విశాఖపట్నం అబ్బాయి పైలా అవినాశ్ రూ.30 లక్షలు-పంజాబ్ లు ఈ ఐపీఎల్ లోని అచ్చ తెలుగువారు.

Tags:    

Similar News