ధోనీ.. 44 ఏళ్ల వయసు.. అద్భుత ఫిట్ నెస్సు.. 0.12 సెకన్లలో స్టంపింగ్
ముంబై ఇండియన్స్ తో ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ధోనీ స్టంపింగ్ చేసిన విధానం చూస్తే.. అతడు ఇంకా అంతర్జాతీయ క్రికెట్ ఎందుకు ఆడట్లేదు? అని అనుమానించడంలో సందేహం లేదు.;
అంతర్జాతీయ క్రికెట్ ఆడి ఆరేళ్లవుతుంది..కనీసం దేశవాళీల్లోనూ బరిలో దిగింది లేదు.. పూర్తిస్థాయి మ్యాచ్ ప్రాక్టీస్ లేక ఏడాది అవుతోంది.. అన్నిటికి మించి 44 ఏళ్ల వయసు.. కానీ, అతడిలో చురుకుదనం మాత్రం కాస్తంత కూడా తగ్గలేదు..
టీమ్ ఇండియాకు ఎందరో వికెట్ కీపర్లు ప్రాతినిధ్యం వహించారు.. కొందరు భారత క్రికెట్ లో అత్యుత్తమ కీపర్ వ్రద్ధిమాన్ సాహా అని అంటారు.. కానీ, కొందరు మాత్రం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అని బల్లగుద్ది చెబుతారు.
ముంబై ఇండియన్స్ తో ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ధోనీ స్టంపింగ్ చేసిన విధానం చూస్తే.. అతడు ఇంకా అంతర్జాతీయ క్రికెట్ ఎందుకు ఆడట్లేదు? అని అనుమానించడంలో సందేహం లేదు. వాస్తవానికి ధోనీ అత్యుత్తమ కీపింగ్ నైపుణ్యాలున్నవాడు కాదు.. కానీ, మ్యాచ్ లో ఏం చేయాలో అతడికి తెలుసు. ముంబైతో మ్యాచ్ లో అదే చేశాడు.
360 డిగ్రీ బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ కొద్ది సేపు క్రీజులో ఉన్నా చేసే విధ్వంసం ఎలాంటిదో చాలాసార్లు చూశాం. అలాంటివాడిని ఔట్ చేయాలంటే వికెట్ల వెనుక చాలా చురుగ్గా ఉండాలి. అంతటి నైపుణ్యం ధోనీకే ఉందని చెప్పాల్సిన పనిలేదు. దానిని మరోసారి రుజువు చేస్తూ ధోనీ తన స్థాయి ఏమిటో చూపాడు.
ప్రత్యర్థి బ్యాటర్ సెకను సమయం ఇస్తే చాలు.. స్టంపింగ్ చేయగల సత్తా ధోనీ సొంతం. దీనిని చాలాసార్లు చూపించాడు. ఆదివారం మ్యాచ్ లో సూర్యను 0.12 సెకన్లలోనే స్టంపిగ్ చేశాడు మహి.
కాగా ధోనీ స్టంపింగ్ సత్తా ఏమిటో తెలిసిన సూర్య కనీసం రివ్యూ కూడా చేయకుండానే వెళ్లిపోయాడు. ముంబై ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ బౌలింగ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇదే మ్యాచ్ విన్నింగ్ మూమెంట్
ఆదివారం మ్యాచ్ లో సూర్య స్టంపింగ్ తో ధోనీ చెన్నై గెలుపునకు బాటలు వేశాడు. 26 బంతుల్లో 29 పరుగులు చేసి మంచి ఊపుమీదున్న సూర్యను అప్పుడు గనుక పెవిలియన్ పంపకుంటే అతడు మరింత చెలరేగి ఆడేవాడు అనడంలో సందేహం లేదు.
కాగా 1981 జూలై 7న పుట్టిన ధోనీ వచ్చే జూలైకి 44 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు. బ్యాటర్ గా అతడు జట్టు గెలిచేందుకు అవసరమైన పరుగులు చేయలేకపోవచ్చు. జట్టును గెలిపించే నిర్ణయాలు తీసుకోవడంలో, గెలిపించేలా చేయడంలో మాత్రం చాలా ఉపయోగపడతాడు. సూర్య స్టంపింగ్ దీనికి ఉదాహరణ.