బాహుబలి ధోనీకి కట్టప్ప దీపక్.. అక్క అసహనం!

సురేశ్ రైనా, విరాట్ కోహ్లి వంటి వారితో మాత్రమే ధోనీ బాగా క్లోజ్ అనిపిస్తుంది.. మరో ఆటగాడు దీపక్ చాహర్ తోనూ ధోనీ వ్యక్తిగతంగా సన్నిహితం అనిపిస్తుంటుంది;

Update: 2025-03-24 10:50 GMT

సచిన్ నుంచి యువరాజ్ వరకు.. గంగూలీ నుంచి రోహిత్ దాకా.. ఎందరో దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడిన టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వారెవరితోనూ అత్యంత సన్నిహితంగా ఉన్నట్లు కనిపించడు.

సురేశ్ రైనా, విరాట్ కోహ్లి వంటి వారితో మాత్రమే ధోనీ బాగా క్లోజ్ అనిపిస్తుంది.. మరో ఆటగాడు దీపక్ చాహర్ తోనూ ధోనీ వ్యక్తిగతంగా సన్నిహితం అనిపిస్తుంటుంది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన సందర్భంలో ఐపీఎల్ మ్యాచ్ ల అనంతరం దీపక్ ను ధోనీ ఆటపట్టించడం అందరూ గమనించారు.

ఎలాంటి ఆటగాడైనా చెన్నైకి ఆడితే రాణించడం ఖాయం. అలానే 2018 నుంచి చెన్నైకు ప్రాతినిధ్యం వహించిన దీపక్ చాహర్ కూడా టీమ్ఇండియాకు ఎంపికయ్యాడు. అయితే, వరుస గాయాలు అతడి అంతర్జాతీయ కెరీర్ ను దెబ్బతీశాయి. కాగా, గత ఏడాది నవంబరులో జరిగిన మెగా వేలంలో దీపక్ ను చెన్నై రిటైన్ చేసుకోలేదు. వేలంలో అతడిని ముంబై ఇండియన్స్‌ రూ.9.25 కోట్లకు సొంతం చేసుకుంది.

మొత్తానికి చెన్నైతో ఆరేళ్ల బంధం ముగియడంతో ముంబై తరఫున బరిలో దిగిన దీపక్ తొలి మ్యాచ్ లోనే మంచి ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్ లో (28 నాటౌట్‌; 15 బంతుల్లో 2×4, 2×6) రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. బౌలింగ్ లో 2 ఓవర్లలో 18 పరుగులిచ్చి వికెట్‌ పడగొట్టాడు.

ముంబై-చెన్నై మ్యాచ్ సందర్భంగా దీపక్ చాహర్ పై మీమ్స్ వచ్చాయి. దీపక్ ను ‘కట్టప్ప’తో పోల్చిన వీటిని అతడి అక్క మాలతి ఇన్‌స్టా గ్రామ్ లో షేర్‌ చేసింది. వీటిని నవ్వుతూనే పోస్ట్ చేసిన మాలతి.. మీమ్‌లో ముంబై జెర్సీతో ఉన్న దీపక్‌ ఫొటో కింద.. బాహుబలి సినిమాలో ప్రభాస్‌ ను కట్టప్ప వెనుకనుంచి కత్తితో పొడిచిన సీన్‌ ఉంది. దీన్నిషేర్‌ చేసిన మాలతి లాఫింగ్ ఎమోజీలను జత చేసింది.

ఆదివారం మ్యాచ్ లో చివర్లో ధోనీ బ్యాటింగ్ దిగి 2 బంతులు ఆడాడు.

ధోనీపై దీపక్‌ స్లెడ్జింగ్‌ చేయబోయాడు. ‘‘నీకు చాలా దగ్గరగా ఫీల్డింగ్‌ చేస్తా’’.. ‘‘ధోనీ.. ధోనీ’’ అంటూ చప్పట్లు కొట్టాడు. అయితే, ఎప్పుడూ మ్యాచ్ ముగిశాక దీపక్ ను ఆటపట్టించడం ధోనీకి అలవాటు. తాజాగా తనను స్లెడ్జింగ్ చేసిన దీపక్ ను బ్యాట్‌ తో కొట్టినట్లుగా ధోనీ జోక్ చేశాడు.

Tags:    

Similar News