రాబిన్ హుడ్ వార్నర్.. ఐపీఎల్ లో అన్ సోల్డ్.. పీఎస్ఎల్ లో కెప్టెన్

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో.;

Update: 2025-03-25 10:00 GMT

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఐపీఎల్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ కు టైటిల్ అందించిన కెప్టెన్. కానీ, ఇప్పుడు అతడు మునుపటి వార్నర్ కాదుగా.. అటు రిటైర్మెంట్ ప్రకటించి ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు దూరం కాగానే ఇటు ఐపీఎల్ లోనూ దూరం పెట్టేశారు. నిరుడు నవంబరులో జరిగిన మెగా వేలంలో వార్నర్ ను ఎవరూ కొనుగోలు చేయలేదు. మూడేళ్లు తను ప్రాతినిధ్యం వహించిన ఢిల్లీ క్యాపిటల్స్ గానీ.. ఏడేళ్లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ గానీ కొనుగోలు చేయలేదు. దీంతో ఐపీఎల్ టైటిల్ అందించినా మెగా వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోయిన అవమానాన్ని మూటగట్టుకున్నాడు వార్నర్.

హైదరాబాదీ డేవిడ్

ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ కెరీర్ డీసీతోనే ప్రారంభమైంది. అయితే, ఆ డీసీ ఢిల్లీ క్యాపిటల్స్ కాదు. దక్కన్ చార్జర్స్. 2009లో టైటిల్ విజేతగా నిలిచిన దక్కన్ చార్జర్స్ జట్టులో వార్నర్ భాగస్వామి. 2014 నుంచి ఆ జట్టు సన్ రైజర్స్ గా మారగా దాంట్లోనూ భాగస్వామి అయ్యాడు. 2016లో కెప్టెన్ గా టైటిల్ అందించాడు. అంటే వరుసగా 14 ఏళ్ల పాటు హైదరాబాద్ కు ఆడిన ఘనత వార్నర్ ది. బహుశా మరే ప్లేయర్ కూ ఐపీఎల్ లో ఈ రికార్డు లేదేమో?

సినిమాల్లోనూ..

వార్నర్ కు తెలుగు నేలతో ఎంతగా అనుబంధం పెరిగిందో పుష్ప సినిమా సీన్లను అతడు అనుకరించిన విధానాన్ని బట్టి తెలిసిపోతుంది. తాజాగా రాబిన్ హుడ్ అనే సినిమాలోనూ వార్నర్ నటించాడు.

అయితే, వార్నర్ అన్ సోల్డ్ గా మిగిలిపోవడంతో ఈ సీజన్ లో ఐపీఎల్ లో ఆడే చాన్స్ లేకుండా పోయింది. అంతమాత్రాన అతడు ఆగలేదు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లోకి వెళ్లాడు. అక్కడ కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ప్లాటినం కేటగిరీలో వార్నర్ ను కరాచీ కింగ్స్ తీసుకుంది.

కొసమెరుపు: సన్ రైజర్స్ కు ఆడిన సమయంలో మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తో వార్నర్ అద్భుతాలు చేశాడు. ఇప్పుడు కరాచీ కింగ్స్ వార్నర్ తో పాటు విలియమ్సన్ నూ తీసుకుంది.

Tags:    

Similar News