ఐపీఎల్ లో బాల్ ట్యాంపరింగ్.. సోషల్ మీడియాలో హోరు.. ముంబై మండిపాటు
దీని తర్వాత పరిణామాలు చాలా మారాయి. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో ట్యాంపరింగ్, ఫిక్సింగ్ వంటివి మాట వరుసకైనా వినిపించడంలేదు.;
2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, కామెరూన్ బాన్ క్రాఫ్ట్ శాండ్ పేపర్ ఉపయోగించి బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన ఉదంతం ప్రపంచ క్రికెట్ ను కుదిపేసింది. దీని తర్వాత పరిణామాలు చాలా మారాయి. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో ట్యాంపరింగ్, ఫిక్సింగ్ వంటివి మాట వరుసకైనా వినిపించడంలేదు.
అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ఆరంభంతోనే ట్యాంపరింగ్ మాట బయటకు వస్తోంది. ఆదివారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు. అతడికి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సహకారం అందించినట్లు ఉన్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ముంబై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే?
ఆదివారం మ్యాచ్ లో ఖలీల్ తన జేబులో నుంచి ఒక కాగితాన్ని బయటకు తీసి బంతికి రుద్దాడు. దానిని తర్వాత రుతురాజ్ కు ఇచ్చాడు. దానిని అతడు జేబులో పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఖలీల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడని అతడికి సహకరించిన రుతురాజ్ ను కూడా బ్యాన్ చేయాలని ముంబై ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
నిజంగానే చేశారా?
ఐపీఎల్ అత్యంత విజయవంతమైన రెండు జట్ల మధ్య మ్యాచ్.. పైగా అటు ధోనీ ఇటు రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు.. ఇద్దరు దిగ్గజాలు జట్టులో ఉండగా.. ట్యాంపరింగ్ లాంటి సిల్లీ అంశం చోటుచేసుకుంటుందని భావించడం కష్టమే. వాస్తవానికి ధోనీ, రోహిత్ ఇద్దరూ అత్యంత గొప్ప కెప్టెన్లు కూడా. కేవలం కష్టాన్ని, క్రికెట్ ను నమ్ముకుని వచ్చినవారు. అలాంటి గొప్ప స్టార్లు ఉన్న జట్ల మధ్య మ్యాచ్ లో సహచరులు ట్యాంపరింగ్ చేస్తారని భావించలేం.
రుతురాజ్ టీమ్ ఇండియాకు త్వరలో మళ్లీ ఎంపికయ్యే చాన్సున్నవాడు. ఖలీల్ కూడా ఇప్పటికే భారత్ కు ఆడాడు. మున్ముందు కూడా ఆడడం ఖాయం. మంచి భవిష్యత్ ఉన్న వీరిద్దరూ ట్యాంపరింగ్ చేస్తారని అనుకోవడం కూడా సరికాదు. కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఖలీల్-రుతురాజ్ వీడియో వెనుక ఏం ఉన్నదో తేల్చాల్సిన అవసరం ఉంది.