హలో రాహుల్ కంగ్రాట్స్.. సంజీవ్ గోయెంకాపై ట్రోలింగ్ మామూలుగా లేదు

ఏ రంగంలో ఉండేవారు ఆ రంగంలో ఉండాలి అని గతంలో అనేవారు.;

Update: 2025-03-25 12:33 GMT

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం.. ఒక మ్యాచో ఓటమికే కుంగిపోయి.. మరో మ్యాచ్ గెలుపుతో పొంగిపోతే దానికి అర్థం ఉండదు.. ముఖ్యంగా క్రికెట్ లో అయితే.. ఈ రోజు సెంచరీ కొట్టిన బ్యాట్స్ మన్ రేపు డకౌట్ అవ్వొచ్చు.. ఈ రోజు ఐదు వికెట్లు తీసిన బౌలర్ రేపు వంద పరుగులు ఇవ్వొచ్చు.. వీటన్నిటినీ సమానంగా తీసుకుంటేనే ముందుకెళ్లగలం.

ఏ రంగంలో ఉండేవారు ఆ రంగంలో ఉండాలి అని గతంలో అనేవారు. దీనికో నేపథ్యం ఉంది. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చాక వ్యాపారులు క్రికెట్ లోకి దిగి ఆయా ఫ్రాంచైజీలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, వ్యాపారులకు తెలిసింది ఒక్కటే.. విజయం. కానీ, క్రీడల్లో అన్నిసార్లూ ఇది సాధ్యం కాదు కదా..?

మూడేళ్ల కిందట ఐపీఎల్ లో అడుగుపెట్టింది లక్నో సూపర్ జెయింట్స్. టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా తీసుకుంది. మెరుగైన జట్టుగానే పేరు తెచ్చుకుంది. అయితే, కాస్త నెమ్మదిగా ఆడే జట్టుగా ముద్ర పడింది.

నిరుడు మ్యాచ్ సందర్భంగా లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకాకు కెప్టెన్ కేఎల్ రాహుల్ కు మైదానంలోనే వాగ్వాదం జరిగింది. ఇది జట్టు ప్రదర్శన మీదనే అని అందరికీ తెలుసు.

అప్పటి పరిస్థితిని చూసిన అందరూ రాహుల్ ఇకమీదట లక్నోకు ఆడడు అని అనుకున్నారు. మధ్యలో రాహుల్-సంజీవ్ గోయెంకా భేటీ అయినా చివరకు అనుకున్నదే జరిగింది. ఇక రాహుల్ ను లక్నో రిటైన్ చేసుకోలేదు. అతడిని మెగా వేలంలో ఢిల్లీ దక్కించుకుంది.

తాజాగా రాహుల్ భార్య అతియా శెట్టి కూతురుకు జన్మనిచ్చింది. ఇందుకోసమే రాహుల్ సోమవారం తన మాజీ జట్టు లక్నోతో మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. మరోవైపు రాహుల్ తండ్రయిన నేపథ్యంలో అతడికి సంజీవ్ శుభాకాంక్షలు తెలిపాడు. ‘అద్భుత‌మైన వార్త. ఆనందంగా ఉంది. రాహుల్‌, అతియా మీకు కూతురు పుట్టినందుకు అభినంద‌లు’’ అని సోష‌ల్ మీడియాలో సంజీవ్ గోయెంకా పేర్కొన్నారు. దీంతో ఇదే సందర్భం అనుకుని రాహుల్ ను గతంలో గోయెంకా అవమానించడాన్ని గుర్తుచేస్తున్నారు అభిమానులు. విన‌య‌పూర్వ‌క‌మైన వ్య‌క్తిని ఇంకెప్పుడూ అగౌర‌వ‌ప‌ర‌చ‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు.

నిరుడు లక్నోతో మ్యాచ్ లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 10 వికెట్ల తేడాతో స‌న్‌రైజ‌ర్స్ గెలిచింది. ఈ మ్యాచ్ అనంత‌రం మైదానంలో రాహుల్ పై గోయెంకా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. దీంతో అతడిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. చెప్పాలంటే రూంలో చెప్పాలి గానీ.. స్టార్ క్రికెట‌ర్ ప‌ట్ల మైదానంలో ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని మండిపడ్డారు.

Tags:    

Similar News