జట్టు మారితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచే.. ఈ ఐపీఎల్ లో వారిదే హవా
సరి సమానంగా ఐదు టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కూడా పోటాపోటీగానే సాగిందని చెప్పాలి.;
ఐపీఎల్ 18వ సీజన్ అనుకున్నట్లే రంజుగా మొదలైంది. శనివారం తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స బెంగళూరు చేతిలో డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ కంగుతినగా.. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపింది. సరి సమానంగా ఐదు టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కూడా పోటాపోటీగానే సాగిందని చెప్పాలి.
విశాఖలోనూ పోటాపోటీ
ఇక విశాఖపట్నంలో సోమవారం నాటి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ కూడా మజా పంచింది. ఈ మ్యాచ్ లో లక్నో గెలిచే స్థితి నుంచి ఓడిపోయింది. ఇప్పటివరకు మొత్తం నాలుగు మ్యాచ్ లు జరిగాయి అన్నమాట. మంగళవారం గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి.
శనివారం నాటి బెంగళూరు-కోల్ కతా మ్యాచ్ లో మూడు వికెట్ల తీసిన టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ క్రనాల్ పాండ్యా, ఆదివారం రాజస్థాన్ పై అజేయ సెంచరీ కొట్టిన సన్ రైజర్స్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్, ముంబైపై బంతిని నూరిన నూర్ అహ్మద్ (చెన్నై), లక్నోపై 66 పరుగుల సూపర్బ్ ఇన్నింగ్స్ తో ఆశుతోష్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లుగా నిలిచారు.
కాగా, ఈ నలుగురు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లు ఈ సీజన్ లో ఫ్రాంచైజీలు మారినవారే కావడం గమనార్హం. పెద్ద పాండ్యా గత సీజన్ వరకు లక్నో సూపర్ జెయింట్స్ కు ఆడాడు. అతడిని రిటైన్ చేసుకోలేదు. వేలంలోనూ తీసుకోలేదు. ఇక నూర్ అహ్మద్ ను గుజరాత్ టైటాన్స్ వదులుకుంది. వివాదాల నేపథ్యంలో కిషన్ ను ముంబై వద్దనుకుంది. ఇక గత సీజన్ లో పంజాబ్ తరఫున అద్భుతంగా ఆడినా ఆశుతోష్ ను ఆ ఫ్రాంచైజీ అట్టిపెట్టుకోలేదు. వేలంలో అతడిని ఢిల్లీ కొనుక్కుంది. ఇలా ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్ లలోనూ జట్టు మారిన వారే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లుగా నిలవడం గమనార్హం.
మంగళవారం గుజరాత్-పంజాబ్ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవుతాడా..? లేక రాజస్థాన్ నుంచి గుజరాత్ కు వచ్చిన బట్లర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవుతాడా?