ఐపీఎల్ రూ.27 కోట్ల వీరుడు.. డిజాస్టర్ గేమ్.. గోయెంకాతో మీమ్స్ మసాలా
గోయెంకా ఇష్టపడకపోవడంతో రాహుల్ లక్నోతో కొనసాగలేకపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కు మారాడు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ ను తీసుకొచ్చుకుంది లక్నో.;

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే రికార్డులే కాదు.. వివాదాలు కూడా.. ఇలానే గత ఏడాది ఓ పెద్ద వివాదం.. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా, కెప్టెన్ కేఎల్ రాహుల్ మధ్య మైదానంలో సంవాదం జరగడం.. నెమ్మదిగా ఆడే జట్టుగా లక్నోపై ముద్ర పడడం వీరిద్దరి మధ్య వాగ్వాదానికి కారణమైంది. అప్పుడే రాహుల్ లక్నో జట్టుతో కొనసాగడం కష్టమని తెలిసిపోయింది. తర్వాత అదే జరిగింది.
రాహుల్ పోయి పంత్ వచ్చినా..
గోయెంకా ఇష్టపడకపోవడంతో రాహుల్ లక్నోతో కొనసాగలేకపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కు మారాడు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ ను తీసుకొచ్చుకుంది లక్నో. అదీ..మెగా వేలంలో రూ.27 కోట్లు పెట్టి. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర కావడం గమనార్హం.
6 బంతులు.. 0 పరుగులు..
రూ.27 కోట్ల విలువైన కెప్టెన్ పంత్ సోమవారం తన మాజీ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తో మొదటి మ్యాచ్ లో డిజాస్టర్ గా మారాడు. దూకుడుగా ఆడే బ్యాటర్ గా పేరున్న అతడు 6 బంతులు ఎదుర్కొని ఖాతానే తెరవలేదు. లక్నో భారీ స్కోరు చేయాల్సిన సమయంలో వచ్చిన అతడు బంతులను మింగడమే కాక.. డకౌట్ అయ్యాడు. పూరన్, మార్ష్ లేకుంటే లక్నో పరిస్థితి దారుణంగా ఉండేదే.
కీపింగ్ లోనూ ఫెయిల్
పంత్ ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగానూ తప్పలు చేశాడు. ఆ జట్టు అలౌటయ్యే పరిస్థితిలో ఉండగా.. బ్యాటింగ్ కు వచ్చిన మోహిత్ శర్మను స్టంపవుట్ చేసే అవకాశం జారవిడిచాడు. ఆ స్టంపింగ్ చేసి ఉంటే లక్నోకు గెలుపు అవకాశాలు ఉండేవి. కెప్టెన్సీలోనూ పంత్ తన ముద్ర చూపలేకపోయాడు.
ఇప్పుడు గోయెంకా ఏమంటాడో?
నిరుడు రాహుల్ మెరుగ్గా ఆడుతున్నా.. అతడిని మైదానంలోనే నిందించాడు సంజీవ్ గోయెంకా. మరిప్పుడు పంత్ విషయంలో ఏం చేస్తాడో చూడాలి. సరిగ్గా ఇదే పాయింట్ ను పట్టుకున్నారు మీమర్స్. జట్టు ఓటమి తర్వాత పంత్ తో గోయెంకా మాట్లాడుతున్న ఫొటోకు తమదైన శైలిలో విశ్లేషణలు జోడిస్తున్నారు. కొందరు నిరుడు రాహుల్-గోయెంకా సంభాషణతో పోల్చగా.. మరికొందరు ఆస్ట్రేలియా టూర్ లో పంత్ కొట్టిన నిర్లక్ష్యపు షాట్ ను ఉద్దేశిస్తూ దిగ్గజ బ్యాటర్ సునీల్ గావస్కర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్..’’ పంత్, గోయెంకా మాట్లాడుకుంటున్న ఫొటోకు తగిలించారు. అన్నట్లు వీరిద్దరి మధ్యలో లక్నో కోచ్, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ కూడా ఉన్నాడు.