గ్రౌండ్ లోనే గుండెపోటు.. 36 ఏళ్ల అంతర్జాతీయ క్రికెటర్ పరిస్థితి విషమం

బంగ్లాదేశ్ లో ఢాకా ప్రీమియర్‌ డివిజన్‌ క్రికెట్‌ లీగ్‌ లో మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న తమీమ్ కు గ్రౌండ్ లోనే గుండెపోటు వచ్చింది.;

Update: 2025-03-24 10:12 GMT

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ప్రపంచంలో గుర్తించదగిన జట్టుగా గుర్తింపు పొందిందంటే దానికి కారణం.. 2007 నుంచి ఉన్న కొందరు ఆటగాళ్లు.. అలాంటివారిలో షకిబుల్ హసన్, ముష్పికర్ రహీమ్, తమీమ్ ఇక్బాల్ వంటి వారు కీలకం. వీరంతా బంగ్లా జాతీయ జట్టుకు కెప్టెన్లుగా పనిచేసినవారే. షకిబుల్, తమీమ్ ఇటీవల రిటైర్ అయ్యారు. షకిబ్ విదేశాల్లో స్థిరపడే ప్రయత్నాలు చేస్తుండగా తమీమ్‌ ఇక్బాల్‌ స్వదేశంలో లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు.

బంగ్లాదేశ్ లో ఢాకా ప్రీమియర్‌ డివిజన్‌ క్రికెట్‌ లీగ్‌ లో మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న తమీమ్ కు గ్రౌండ్ లోనే గుండెపోటు వచ్చింది. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉందని, వెంటిలేటర్‌ పై ఉన్నాడని బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ డాక్టర్ దేవాశీష్‌ చౌధురి ప్రకటించారు.

ఢాకా ప్రీమియర్‌ లీగ్‌ లో సోమవారం మొహమ్మదన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌, షినెపుకర్‌ క్రికెట్‌ క్లబ్‌ మధ్య మ్యాచ్‌ లో తమీమ్ ఆడుతున్నాడు. మొహమ్మదన్ క్లబ్‌ కు అతడు కెప్టెన్‌ కూడా. టాస్‌ కోసం మైదానంలోకి వచ్చాడు కూడా. మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం అవుతుందనగా.. తమీమ్ ఛాతీలో నొప్పితో బాధపడ్డాడు. అక్కడే ఉన్న ఫజిలాతున్నెసా ఆసుపత్రికి తరలించి పరీక్షించగా.. స్వల్ప గుండెపోటు అని గుర్తించారు. దీంతో రాజధాని ఢాకాకు తీసుకెళ్లేందుకు హెలికాప్టర్‌ ఏర్పాటు చేసి.. హెలి ప్యాడ్‌ కు వెళ్తుండగా మళ్లీ గుండెపోటు వచ్చింది. తిరిగి స్థానిక ఆసుపత్రికే తీసుకొచ్చారు.

36 ఏళ్ల తమీమ్ ఇక్బాల్ 2023లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌ కు వీడ్కోలు పలికాడు. లీగ్‌ మ్యాచ్‌ లు ఆడుతూ, కామెంట్రీ చేస్తున్నాడు.

బంగ్లాదేశ్ తరఫున 70 టెస్టుల్లో 5,134 పరుగులు, 243 వన్డేల్లో 8,357 పరుగులు, 78 టీ20ల్లో 1,758 పరుగులు చేశాడు. తమీమ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కేవలం 18 ఏళ్ల వయసులో .. 2007 ఫిబ్రవరిలో టి20, సెప్టెంబరులో వన్డే, 2008 జనవరిలో టెస్టు అరంగేట్రం చేసిన తమీమ్.. 2024 వరకు ఆడాడు.

Tags:    

Similar News