ఐపీఎల్-18లో ఆదివారం 2 చెత్త రికార్డులు.. ఒకటి రోహిత్.. రెండోది ఎవరు?

ఆదివారం డబుల్ హెడర్ కూడా ముగిసింది.. మాజీ చాంపియన్లు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్), ముంబై ఇండియన్స్ (ఎంఐ)కు చేదు ఫలితాలే మిగిలాయి.;

Update: 2025-03-24 03:57 GMT

అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మొదలై రెండో రోజు కూడా గడిచింది.. ఆదివారం డబుల్ హెడర్ కూడా ముగిసింది.. మాజీ చాంపియన్లు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్), ముంబై ఇండియన్స్ (ఎంఐ)కు చేదు ఫలితాలే మిగిలాయి.

ఆదివారం ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కసికొద్దీ కొట్టి రాజస్థాన్ ను ఓడిచింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కేవలం 47 బంతుల్లోనే 106 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే, ఇందులో దారుణంగా బలైంది ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్. రాజస్థాన్ కు ఆడుతున్న ఆర్చర్.. 4 ఓవర్లలోనే 76 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ లో ఒక బౌలర్ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే కావడం గమనార్హం.

మాజీ చాంపియన్లు ముంబై, చెన్నై మధ్య జరిగిన మరో మ్యాచ్ లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ డకౌట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ లో అత్యధిక సార్లు (18) డకౌట్ అయిన బ్యాటర్ గా దినేశ్ కార్తీక్, గ్లెన్ మ్యాక్స్ వెల్ ల సరసన చేరాడు. సునీల్ నరైన్, పీయూష్ చావ్లా 16 సార్లు డకౌట్ అయ్యారు.

కాగా, దేశానికి టి20 ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ గా, అంతర్జాతీయ టి20ల్లో ఐదు సెంచరీలు చేసిన గొప్ప బ్యాట్స్ మన్ గా పేరున్న రోహిత్ శర్మ ఐపీఎల్ లో అత్యధిక డకౌట్ల రికార్డును మూటగట్టుకోవడం ఆశ్చర్యమే.

ఇక జోఫ్రా ఆర్చర్.. ఇంగ్లండ్ ప్రధాన పేసర్. పుట్టింది కరీబియన్ దీవుల్లో అయినా ఇంగ్లండ్ స్థిరపడ్డాడు. ఇతడి కోసమే 2019 వన్డే ప్రపంచ కప్ ముంగిట విదేశీ ఆటగాళ్ల నిబంధనలను సడలించింది ఇంగ్లండ్. అలాంటి ఆర్చర్ ఇప్పుడు దారుణ ప్రదర్శన చేస్తున్నాడు. ఇటీవలి భారత పర్యటనలోనే కాదు..చాంపియన్స్ ట్రోఫీలోనూ పెద్దగా ఆకట్టుకోలేదు.

కొసమెరుపు: 2019 వన్డే ప్రపంచ కప్ లో ఆర్చర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. నాడు అతడు వేసిన ఓ బంతి వికెట్లకు తగిలి కీపర్ తల మీదుగా బౌండరీ లైన్ బయటకు (సిక్స్) వెళ్లింది. ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచ కప్ గెలిచిందంటే కారణం ఆర్చర్ అనుకోవాలి. ఇదే ప్రపంచ కప్ లో అత్యధికంగా ఐదు సెంచరీలు కొట్టాడు రోహిత్ శర్మ. ఒకే ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన వీరిద్దరూ ఒకే రోజు ఇలా చెత్త రికార్డులు మూటగట్టుకోవడం విచిత్రమే.

Tags:    

Similar News