ఇషాన్ కిషన్ (సన్) రైజింగ్.. ఈ ఉప్పల్ సెంచరీ చాలు

2023 లో భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో తొలి రెండు మ్యాచ్ లలో ఇషాన్ కిషన్ కు చోటిచ్చారు.;

Update: 2025-03-24 03:30 GMT

టీమ్ ఇండియాలో వన్డే డబుల్ సెంచరీ సాధించిన ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్.. ఈ జాబితాలో మరొక బ్యాట్స్ మన్ పేరు కూడా ఉండాలి కదా? అనుకుంటున్నారా? అవును అతడే ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ 2022 డిసెంబర్ 10న బంగ్లాదేశ్ తో వన్డే లో 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. వన్డే చరిత్రలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు అతడే.

మరి ఇప్పుడు ఇషాన్ కిషన్ ఎక్కడున్నాడు..? వన్డే ఫార్మాట్ లో జరిగిన మొన్నటి చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమ్ ఇండియాలో సభ్యుడు కాదు.. అంతకుముందు ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు కూడా లేడు.. అసలు వన్డే ప్రపంచ కప్ అనంతరం అతడు టీమ్ ఇండియాకు ఆడనేలేదు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఒక యువ బ్యాట్స్ మన్ ఇప్పుడు జట్టులోనే లేకపోవడానికి కారణం ఏమిటి?

ఇదీ అసలు కారణం..

2023 లో భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో తొలి రెండు మ్యాచ్ లలో ఇషాన్ కిషన్ కు చోటిచ్చారు. రెగ్యులర్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ కు వైరల్ జ్వరం రావడంతో కిషన్ ను ఆడించారు. కిషన్ విఫలం కావడం, గిల్ కోలుకోవడంతో మళ్లీ కిషన్ కు తుది జట్టులో చోటు దక్కేలేదు. అయితే, ఇది అతడిని బాధించిందట. దీని తర్వాత దేశవాళీ టోర్నీలు ఆడాలని బీసీసీఐ కోరినా కిషన్ ధిక్కరించాడు. దీంతో టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. ఆ తర్వాత దేశవాళీల్లో రాణించి మళ్లీ ఇండియా ఎ జట్టుకు ఎంపికయ్యాడు.

ఇషాన్ వెలుగులోకి వచ్చింది ముంబై ఇండియన్స్ ద్వారా. అలాంటివాడిని రిటైన్ చేసుకోలేదు. దీంతో మెగా వేలంలో సన్ రైజర్స్ తీసుకుంది. రూ.11.20 కోట్లు పెట్టింది. అసలే వివాదాల్లో ఉన్నకిషన్ కు ఇంత ఇవ్వడం సరికాదనే మాటలు వినిపించాయి. కానీ, ఇప్పుడు ఐపీఎల్‌ 18వ సీజన్ లో తొలి మ్యాచ్‌ లోనే సెంచరీ కొట్టేశాడు. తన రేటుకు న్యాయం చేశాడు. దీంతో ఇషాన్ మళ్లీ టీమ్ ఇండియాకు ఆడతాడా? అనే ఆశలు కలుగుతున్నాయి.

అయితే, ఇషాన్ కిషన్ ఇప్పుడు సెంట్రల్ కాంట్రాక్ట్‌ లో లేడు. దేశవాళీ బుచ్చిబాబు టోర్నీ, దులీప్ ట్రోఫీలో, ఇండియా సి జట్టు తరఫున రాణించాడు. రంజీల్లో, విజయ్ హాజారే ట్రోఫీలో సెంచరీలు చేశాడు.

2022-24 మధ్య ఏడాదికి రూ.15.25 కోట్లకు ముంబై రిటైన్ చేసుకున్న కిషన్ ఇప్పుడు రూ.11.20 కోట్ల ధరకు పడిపోయాడు. అయితే, సన్ రైజర్స్ తరఫున మున్ముందు మంచి ఇన్నింగ్స్ ఆడితే టీమ్ ఇండియాలోకి రీ ఎంట్రీ ఖాయం. రోహిత్, కోహ్లి రిటైరైతే కిషన్ కు చోటు పక్కా అని చెప్పొచ్చు.

Tags:    

Similar News