వెనెజువెలాపై ఉరిమి ఉరిమి భారత్ పై పడ్డట్లు.. ట్రంప్ మరో షాక్?
ఇక రెండోసారి అధ్యక్షుడు కావడం ఆలస్యం.. ట్రంప్ అక్రమ వలసదారులను పంపేయడంపై కన్నేశారు.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడేం చేస్తారో ఎవరికీ తెలియదు.. పనామా కాల్వ స్వాధీనం.. గ్రీన్ ల్యాండ్ ను కొనేయడం.. చైనా, మెక్సికో, కెనడాలపై టారిఫ్ లు.. భారత్ కు బెదిరింపులు.. ఇలాంటి ఒకటేమిటి..? ట్రంప్ చేపట్టే ప్రతి చర్య సంచలనమే..
ఇక రెండోసారి అధ్యక్షుడు కావడం ఆలస్యం.. ట్రంప్ అక్రమ వలసదారులను పంపేయడంపై కన్నేశారు. అసలు ఇలా ఎవరైనా ఆ రోజుల్లో ఏ దేశ అధ్యక్షుడు అయినా చేస్తారా? అనేంతగా ఒక్కో దేశం వారిని లెక్కపెట్టి మరీ పంపించేశారు.
ఇక ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని తాను అధ్యక్షుడు అయిన వారం రోజుల్లో ముగిస్తానని ప్రకటించినట్లుగానే ఆ రెండు వర్గాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేలా చేశారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలోనూ చొరవ చూపి ఆ రెండు దేశాల అధ్యక్షులు జెలెన్ స్కీ, పుతిన్ తో సంప్రదింపులు జరిపారు. వీటన్నిటి తుది ఫలితాలు ఎలా ఉన్నా.. చొరవ మాత్రం అభినందించదగినదే.
ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అది భారత్ కు నేరుగా కాకున్నా షాక్ ఇచ్చేదిగా ఉండడం గమనార్హం.
ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం ఏది..? అని అడిగితే చాలామంది గల్ఫ్ దేశాలు, రష్యా పేరు చెబుతారు. కానీ, దక్షిణ అమెరికాలోని వెనెజువెలాలో అత్యధిక శాతం చమురు నిల్వలు ఉన్నాయి. అంతేకాదు.. వెనెజువెలా దశాబ్దాలుగా అమెరికాకు బద్ద శత్రువు.
తమ పొరుగున ఉన్న ఖండంలోనే తమకు శత్రువులా వెనెజువెలాను తయారు చేసినందుకు అమెరికా అధ్యక్షులు చాలామంది వెనెజువెలా మాజీ అధ్యక్షుడు హ్యుగో చావెజ్ పై కక్ష కట్టారు. అయితే, చావెజ్ ఏనాడూ వెనక్కుతగ్గలేదు. ఇప్పుడు వెనెజువెలా ఆర్థిక పరిస్థితి ఏమిటో పూర్తిగా తెలియాల్సి ఉంది.
ట్రంప్ తాజాగా తీసుకున్న కీలక నిర్ణయం వెనెజువెలాను ఇబ్బందుల్లో పెట్టడమే. దీనిప్రకారం వెనెజువెలా నుంచి చమురు కొనే దేశాలు ఇకమీదట తమతో చేసే వాణిజ్యంలో 25 శాతం అదనపు సుంకం కట్టాలని ట్రంప్ ఆర్డర్ ఇచ్చారు. వెనెజువెలాను శత్రుదేశంగా అభివర్ణించారు ట్రంప్. కాగా, ఆ దేశం నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేసే దేశాల్లో భారత్ కూడా ఉంది. దీంతో ట్రంప్ నిర్ణయం అటు తిరిగి ఇటు తిరిగి మనకే షాక్ ఇచ్చేలా ఉంది.