కెనడాలో భారత యువతిపై దాడి.. సినిమా చూసినట్టు చూసిన జనాలు
కెనడాలోని కాల్గరీ నగరంలోని ఒక రద్దీగా ఉండే రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఒక భారతీయ యువతిపై దారుణంగా దాడి జరిగింది.;
కెనడాలోని కాల్గరీ నగరంలోని ఒక రద్దీగా ఉండే రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఒక భారతీయ యువతిపై దారుణంగా దాడి జరిగింది. చుట్టూ ఉన్నవారు నిశ్శబ్దంగా చూస్తున్నారే కనీసం కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ షాకింగ్ దాడికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ చేయబడింది. సాక్షుల సహాయంతో దాడి చేసిన వ్యక్తిని అరగంటలో అరెస్టు చేశారు. అయితే భారతీయ సంతతికి చెందినట్లు కనిపిస్తున్న మహిళకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాని వైనం పై విమర్శలు గుప్పిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం బ్రేడన్ జోసెఫ్ జేమ్స్ ఫ్రెంచ్ అనే వ్యక్తి కాల్గరీ, కెనడాలోని సిటీ హాల్/బో వ్యాలీ కాలేజ్ స్టేషన్‌లో నిలబడి ఉన్న ఒక భారతీయ మహిళపై దాడి చేశాడు. ఆమె వాటర్ బాటిల్‌ను లాక్కొని ఆమె ముఖంపై నీళ్లు చల్లాడు. ఆ తర్వాత ఫ్రెంచ్ ఆమె జాకెట్‌ను పట్టుకుని ఆమె నిలబడి ఉన్న ట్రాన్సిట్ షెల్టర్ గోడలకు పదే పదే కొట్టాడు. ఆమెను తీవ్రంగా కుదిలిస్తూ ఉక్కిరిబిక్కిరి చేశాడు.
ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ చేయబడిన వీడియోలో మహిళ కేకలు వేయడం వినిపించింది. చివరికి ఫ్రెంచ్ ఆమె ఫోన్ తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులకు కాల్ చేసింది. ఈ ఘటన అంతా చాలా మంది గుమిగూడి దాడిని చూశారు కానీ ఎవరూ దాడి చేసిన వ్యక్తిని ఆపడానికి లేదా బాధితురాలికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు.
ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాధితురాలి జాతి కారణంగా ఈ దాడికి జాతి వివక్ష కారణమై ఉండవచ్చని కొందరు అనుమానించారు. ఈ వీడియోను షేర్ చేస్తూ ఎందుకు ఎవరూ మహిళకు సహాయం చేయలేదని అందరూ ప్రశ్నిస్తున్నారు "కెనడాలో జీవితాన్ని వెతుక్కుంటున్న భారతీయులు అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకునే ముందు ఇలాంటి వీడియోలు చూడాలి" అని మరొకరు కామెంట్ చేశారు.
దాడి చేసిన అనంతరం నిందితుడు బ్రేడన్ జోసెఫ్ జేమ్స్ ఫ్రెంచ్ తన ముఖాన్ని దాచుకోవడానికి హూడీని పైకి లాగి ప్లాట్‌ఫారమ్ నుండి నడుచుకుంటూ వేగంగా వెళ్లడం కనిపించింది. దాడి జరిగిన 25 నిమిషాల్లో పోలీసులు అతడిని పట్టుకున్నారు. కాల్గరీ పోలీసులు దాడి చేసిన వ్యక్తిని ఈస్ట్ విలేజ్‌లో పట్టుకున్నట్లు తెలిపారు. "ఇలాంటి సంఘటనలు సమాజంలో ఆందోళన కలిగిస్తాయి. మా నగరంలో వీటిని సహించబోము." అని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ దాడికి జాతి వివక్ష కారణమని తాము నమ్మడం లేదని పోలీసులు తెలిపారు. అయితే వారి డైవర్సిటీ రిసోర్స్ టీమ్ ఈ సంఘటనతో బాధింపబడ్డ యువతితో మాట్లాడి వివరాలు సేకరిస్తామని తెలిపారు.