అధికారంలోకి వచ్చినంతనే అంబేడ్కర్.. భగత్ సింగ్ ఫోటోల్ని తీసేశారు

ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్.. సంఘ సంస్కర్త బాబా సాహెబ్ అంబేడ్కర్ వారసత్వాన్ని కాషాయ పార్టీ విస్మరిస్తోందన్నారు.;

Update: 2025-03-24 04:19 GMT

అధికారం చేజారి.. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కనీసం ఏడాది కాకుంటే ఆర్నెల్ల పాటు ఆగే అలవాట్లకు ప్రతిపక్షాలు స్వస్తి పలుకుతున్నాయా? అంటే అవునని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో కమలనాథులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. వారు అధికారంలోకి వచ్చి పట్టుమని పది వారాలు కాలేదు. ఆ మాటకు వస్తే నెల మాత్రమే పూర్తైంది. కానీ.. అప్పుడే మీడియా ముందుకు వచ్చేశారు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి.. ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.

ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్.. సంఘ సంస్కర్త బాబా సాహెబ్ అంబేడ్కర్ వారసత్వాన్ని కాషాయ పార్టీ విస్మరిస్తోందన్నారు. వీరి తీరు బ్రిటిష్ వారి కంటే దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే.. అంబేడ్కర్.. భగత్ సింగ్ చిత్ర పటాల్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. తమకు ఈ ఇద్దరు ఆదర్శంగా పేర్కొన్నారు.

తమ కార్యాలయంతో పాటు పంజాబ్ లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో వారిద్దరి ఫోటోలు ఉంటాయని చెప్పారు. అయితే.. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మాత్రం ఫోటోలని తీసేశారన్నారు. గాంధీ ఫోటో పెట్టలేదని అప్పట్లో కాంగ్రెస్ విమర్శలు చేసిందని.. కానీ ఇప్పుడు మాత్రం మౌనంగా ఉందంటూ నిప్పులు చెరిగారు.

తమకు అంబేడ్కర్.. భగత్ సింగ్ లు ఆదర్శమన్న కేజ్రీవాల్.. ప్రస్తుత పాలకులు బ్రిటిష్ కంటే దారుణంగా ఉన్నారని.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్ని సైతం నెరవేర్చటం లేదన్నారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసేందుకు వీలుగా ప్రవేశ పెట్టిన పథకాన్ని అడ్డుకుంటుందని చెప్పారు. యాప్ డౌన్ లోడ్ చేసుకోకుంటే కండక్టర్లు పింక్ టికెట్ ఇవ్వటం లేదని మండిపడ్డారు. ‘గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల్ని ఉపసంహరించుకుంటున్నారు. సౌకర్యాలు కల్పించటం లేదు. ఇప్పటికే మహిళలకు రూ.2500 ఇవ్వాల్సి ఉన్నా.. ఆ తరహా కార్యక్రమాల్ని ప్రారంభించటం లేదు’ అని తప్పుల చిట్టాను విప్పారు.

Tags:    

Similar News